అకీరా నందన్ గ్రాండ్ లాంచ్‌కు కౌంట్‌డౌన్.. రంగంలోకి పవన్ కళ్యాణ్!
మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రావాలని, రాబోతోన్నాడని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, పరిపాలనపరమైన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఈ కారణంగా ఆయన సినిమా ప్రాజెక్టులపై కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో అకిరా నందన్ (Akira Nandan) స్పెషల్ రోల్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లియర్ అయింది. ఫ్యాన్స్‌ను కాసేపు హుషారెత్తించిన ఈ గాసిప్స్ త్వరలోనే ఫేక్ అని తేలిపోయాయి.
ఇదిలా ఉండగా... పవన్ కళ్యాణ్ సినిమాలకంటే ఇప్పుడు ఆయన వారసుడి ఎంట్రీపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. అకీరా నందన్ ఇప్పటికే ఫిజిక్, లుక్, మేనరిజమ్స్ పరంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్‌ను పోలిన బాడీ లాంగ్వేజ్, ఆరడుగుల ఎత్తు, మ్యూజిక్‌పై ఉన్న ఆసక్తి కారణంగా అకీరా భవిష్యత్తుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అకీరా ఎంట్రీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సంగతేంటీ?

లేటెస్ట్ సమాచారం ప్రకారం, క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో అకీరా నందన్‌ను లాంచ్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు టాక్. సాధారణంగా మెగా ఫ్యామిలీ వారసుల ఎంట్రీ అంటే భారీ మాస్ యాక్షన్ మూవీ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. కానీ, పవన్ మాత్రం తన కుమారుడి విషయంలో పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అకీరాను కేవలం స్టార్ కిడ్‌గా కాకుండా, ఒక కంప్లీట్ యాక్టర్‌గా నిలబెట్టాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యమట.
అందుకే సహజమైన నటనకు ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడి కోసం వెతుకుతుండగా శేఖర్ కమ్ముల పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. ఆయన తెరకెక్కించిన హ్యపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల్లో హీరో పాత్రలు చాలా సహజంగా, భావోద్వేగంగా ఉండటం శేఖర్ కమ్ముల స్టైల్. మొదటి సినిమాతోనే నటుడిగా నిరూపించుకునే అవకాశం అకీరాకు ఇవ్వగల దర్శకుడు ఆయనేనని పవన్ భావిస్తున్నారట. ఇదే క్రమంలో అకీరా కోసం ఓ స్పెషల్ స్టోరీ లైన్ సిద్ధం చేయమని శేఖర్ కమ్ములను పవన్ కళ్యాణ్ టీం కోరినట్లు ఫిలిం సర్కిల్స్‌లో టాక్.
ఇక అకీరా విషయానికి వస్తే... కేవలం వారసత్వంతో కాకుండా సొంత ప్రతిభతో ముందుకు రావాలని అతడు పట్టుదలగా ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో నటనకు సంబంధించిన కోర్సులు పూర్తి చేసిన అకీరా, మార్షల్ ఆర్ట్స్‌తో పాటు సంగీతంలోనూ శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్‌పై అతనికి ఎక్కువ ఆసక్తి ఉందని, సినిమాలకంటే సంగీత రంగంలోనే కెరీర్ చేయాలన్న ఆలోచన కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇదే కారణంగా అకీరా మూవీ ఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











