అక్కినేని అఖిల్ ఎంట్రీ ఆ దర్శకుడితోనేనా?
హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. నాగార్జున-అమల తనయుడు అఖిల్ త్వరలో సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్దం అవుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల దర్వకత్వంలో అఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
యూత్ ఫుల్, ఫీల్ గుడ్ మూవీలు తీయడంలో మంచి పనితనం ఉన్న శేఖర్ కమ్ముల అఖిల్ కోసం ఒక మంచి యూత్ ఫుల్ సబ్జెక్టు రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో ద్వారా అమల 20 ఏళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించబోతోంది.
ఈ క్రమంలోనే అఖిల్ విషయం కూడా చర్చకు వచ్చిందని, శేఖర్ కమ్ముల దర్శకత్వలో అఖిల్‌ను వెండి తెరకు పరిచయం చేయడానికి నాగార్జున కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఆడియో వేడుకకు నాగార్జున, అఖిల్, అమల హాజరవ్వడం, నాగార్జున శేఖర్ కమ్ములను పొగుడుతూ మాట్లాడటం వెనక అసలు కారణం ఇదే అని అంటున్నారు.
నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమోదించదగ్గ సబ్జెక్టు, స్క్రీన్ ప్లేను శేఖర్ కమ్ములతో రెడీ చేయిస్తున్నాడని టాక్.


Click it and Unblock the Notifications











