అక్కినేని హీరోతో ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి?
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా పెళ్లిళ్లు, ఎఫైర్స్ , విడాకులు, ప్రేమాయణాలే చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లోనూ ఇదే రకమైన పరిస్ధితి నెలకొంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న స్టార్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది చాలా టాలీవుడ్ సెలబ్రెటీలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా కొందరు దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా అక్కినేని హీరో విషయంలో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మూడు తరాలుగా అలరిస్తోన్న అక్కినేని ఫ్యామిలీ
తన చివరి శ్వాస వరకు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తూనే ఉన్నారు. ఆయనకు ఐదుగురు పిల్లలు వెంకట్, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, నాగార్జున. వీరిలో నాగార్జున, వెంకట్, నాగసుశీల పేర్లు అందరికీ తెలిసిందే. అక్కినేని నట వారసుడిగా నాగార్జున తండ్రి పేరును నిలబెట్టగా.. వెంకట్ వ్యాపారాలు, సినీ నిర్మాణం చూసుకుంటున్నారు. నాగ సుశీల కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు సుమంత్, సుప్రియ, నాగచైతన్య, సుశాంత్, అఖిల్.
పడుతూ లేస్తూ సుమంత్ కెరీర్
అచ్చు గుద్ధినట్లు తాత నాగేశ్వరరావు పోలికలతో ఉండే సుమంత్‌ను హీరోగా ఎంట్రీ ఇప్పించే బాధ్యతను అక్కినేని ఫ్యామిలీ రామ్ గోపాల్ వర్మ చేతుల్లో పెట్టింది. ప్రేమకథ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సుమంత్ అక్కినేని. తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహమంటే ఇదేరా, సత్యం, గౌరీ, ధన 51, మహానంది, గోదావరి, మధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్ వంటి చిత్రాలతో సత్తా చాటారు. అయితే ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన కెరీర్‌లో డౌన్‌ఫాల్ అయ్యింది. మళ్లీ రావా, నరుడా డోనరుడా సినిమాలో ట్రాక్‌లోకి వచ్చినట్లు అనిపించినా తిరిగి యథా ప్రకారమే అయ్యింది. ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ సినిమాలో నటిస్తున్నారు సుమంత్.
కీర్తి రెడ్డితో విడాకులు
తొలి ప్రేమ ఫేమ్ హీరోయిన్ కీర్తి రెడ్డితో ప్రేమలో పడ్డ సుమంత్ పెద్దల అంగీకారంతో ఆమెను 2004లో పెళ్లాడారు. కొన్నాళ్లు సాఫీగానే సాగినప్పటికీ తర్వాత వీరి బంధం బీటలు వారింది. రెండేళ్లు తిరిగేసరికి 2006లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. నాటి నుంచి ఒంటరిగానే ఉంటున్న సుమంత్ రెండో పెళ్లి విషయంలో పలు రకాల ఊహాగానాలు వినిపించినా అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా సుమంత్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారని , ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
సుమంత్‌తో పీకల్లోతు ప్రేమలో స్టార్ హీరోయిన్
ముంబైకు చెందిన ఈ నటి.. రెండేళ్ల క్రితం ఓ స్టార్ హీరో కొడుకుతో చేసిన ప్రేమకథతో టాలీవుడ్‌లో జెండా పాతారు. ఈ దెబ్బతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. ఓ పాన్ ఇండియా సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు అవకాశం దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్‌ను పక్కనపెట్టి పూర్తిగా బాలీవుడ్‌కే అంకితమైంది ఈ బ్యూటీ. అయితే తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే సుమంత్‌తో సదరు హీరోయిన్ క్లోజ్‌గా ఉంటోందని ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
వీరి ప్రేమ పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే సుమంత్‌తో ఆ హీరోయిన్ ప్రేమాయణం నడుపుతోందా? అక్కినేని ఫ్యామిలీ కూడా సుమంత్ పెళ్లికి సుముఖంగా ఉందా? లేక ఎప్పటిలాగే ఇది గాలి వార్తేనా అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











