అల్లు అర్జున్ వెయింటింగ్ అందుకేనా? ‘అరవింద సమేత’ తర్వాత నిర్ణయం...
స్టైలిష్ స్టార్ అభిమానులంతా తమ హీరో తర్వాతి సినిమా ఏమిటి? ఎప్పుడు మొదలవుతుందో? ఎవరి దర్శకత్వంలో ఉంటుందని అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన చివరి చిత్రం 'నా పేరు సూర్య' విడుదలై దాదాపు ఆరు నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు బన్నీ తన తర్వాతి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్యలో విక్రమ్ కుమార్‌తో బన్నీ సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగినా.... అతడు చెప్పిన కథ సంతృప్తినివ్వక పోవడంతో కమిట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఈ సారి రిస్క్ చేయాలనుకోడం లేదు
ఈ సారి కొడితే బాక్సాఫీసు కుంభ స్థలాన్ని కొట్టాలని చూస్తున్న అల్లు అర్జున్.... తనకు భారీ విజయాన్ని అందించే సత్తా ఉన్న పెద్ద డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘నా పేరు సూర్య' విషయంలో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి రిస్క్ చేసిన బన్నీ ఈ సారి అలాంటి మిస్టేక్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట.

త్రివిక్రమ్ కోసమే వెయిటింగ్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్....తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడట. త్రివిక్రమ్ ఇటీవల బన్నీకి చెప్పిన కథ వర్కౌట్ అయిందని అంటున్నారు. అయితే ఓ సినిమా విడుదల కాకముందే మరో సినిమాను ప్రకటించే అలవాటు త్రివిక్రమ్‌కు లేదు. అందుకే ‘అరవింద సమేత' విడుదల తర్వాత వీరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

వర్కౌట్ అయితే హాట్రిక్ ఖాయం
గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు ‘సన్నాఫ్ సత్యమూర్తి' లాంటి హిట్ చిత్రం వచ్చింది. ఈ సారి వీరి కాంబినేషన్లో సినిమా వస్తే హాట్రిక్ ఖాయం అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

అరవింద సమేత
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ' చిత్రం అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











