బన్నీ, దిల్ రాజు ‘లవర్’ పరిస్థితి ఏమిటి?
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, బడా నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో మరో చిత్రం రూపొందబోతోందని, ఆ చిత్రానికి 'లవర్' అనే టైటిల్ ఖరారు చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చింది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
గతంలో దిల్ రాజు బ్యానర్లో 'జోష్' చిత్రానికి దర్శకత్వం వహించిన వాసు వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించ బోతున్నారు. 'జోష్' సినిమాతో ప్రేక్షకులను సంతృప్తి పరచక పోయినప్పటికీ దిల్ రాజు ఈ దర్శకుడికి మరో చాన్స్ ఇచ్చాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించ బోతున్నాడు. అయితే హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా జరుగ లేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'జులాయి' చిత్రం చేస్తున్నాడు. ఈచిత్రం ప్రస్తుతం చివరి దశలో ఉంది. జూన్ 8న 'జులాయి' విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన బద్రీనాథ్ చిత్రం అనుకున్న అంచనాలను అందుకోక పోవడంతో బన్నీ మళ్లీ రూటు మార్చి జులాయిగా మారాడు.
ప్రస్తుతం దిల్ రాజు మహేష్, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతోన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు, రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటితో పాటు దమ్ము, రచ్చ, గబ్బర్ సింగ్ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications