అనుష్క 'నిశ్శబ్దం' వాయిదా! ఆ కారణాల వల్లే డేట్ మార్చేశారా?
ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలిన అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి కోసమే అనుష్క సినిమాలు మానేసిందనే టాక్ వచ్చింది. 'బాహుబలి' సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత వెండితెరపై కనిపించనే లేదు.
దీంతో అనుష్క సినిమా కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇది గమనించిన స్వీటీ తిరిగి ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్దం మూవీ.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు మేకర్స్. త్వర త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 31న 'నిశ్శబ్దం' సినిమా విడుదల చేయాలనుకున్నారు మేకర్స్.
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోందట. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. చూడాలి మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో!.


Click it and Unblock the Notifications











