ప్రభాస్-రాజమౌళి ‘బాహుబలి’ టైటిల్ చేంజ్?
హైదరాబాద్ : రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో 'బాహుబలి' అనే భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'బాహుబలి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'మహాబలి' అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్కా మీడియా సంస్థ కూడా ఫిల్మ్ చాంబర్లో 'మహాబలి' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.
ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బాహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమారాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. జూన్ నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












