NBK108 Story: బాలయ్య ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా.. లీకైన అనిల్ రావిపూడి మూవీ కథ.. మొత్తం జైలులోనేనా!
నటసింహా నందమూరి బాలకృష్ణ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక వైబ్రేషన్. అంతలా ఆయన దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నారు. అలాగే, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్నారు. ఇక, ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో సినిమాల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ స్టోరీ, బాలయ్య గెటప్‌ల వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో
కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న బాలయ్య.. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది కూడా హిట్ అయింది.

అనిల్ రావిపూడితో సినిమా
'వీరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తున్నారట. దీనికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.

మొదలైంది.. ఆటంకాలతో
ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే, జనవరి చివరి వారం నుంచే కొత్త షెడ్యూల్ అనుకున్నా.. తారకరత్న పరిస్థితి వల్ల బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పారు. దీంతో దీనికి కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పలు ఆటంకాలు ఎదురు కావడంతో చిత్రీకరణకు బ్రేకులు పడుతున్నాయి.

అప్పటి నుంచే షురూ చేసి
జనవరి చివరి వారంలోనే మొదలు కావాల్సి ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను బాలకృష్ణ సూచనలతో ఆపేశారని అంటున్నారు. అంతేకాదు, ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారం నుంచి పున: ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అప్పటి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరిపేలా ప్లాన్ చేశారని తెలిసింది. ఇలా ఈ ఏడాది చివరికి దీన్ని విడుదల చేయబోతున్నారట.

సినిమా స్టోరీలైన్ బయటకు
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కథ ముప్పై ఏళ్ల వయసులో జైలు శిక్ష పడి.. నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి కథతో రూపొందుతోందని తెలిసింది. అతడి గురించి నిజం తెలియని కూతురు ద్వేషించడం.. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకుని తండ్రి కోసం తపన పడడం అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం.

మూడు గెటప్పుల్లో బాలయ్య
విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య జైలులో ఉన్నప్పుడు యాభై ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారట. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం 35 ఏళ్లు పైబడిన యువకుడిగా దర్శనమిస్తారని తెలిసింది. వీటితో పాటు మరో గెటప్‌లోనూ బాలయ్య ఇందులో సందడి చేయబోతున్నారట. అంటే మొత్తంగా ఈ చిత్రంలో ఆయన మూడు విధాలుగా కనిపించబోతున్నారు.

ఫస్టాఫ్ అంతా జైలులోనేనా
ఫన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం బాలయ్య జైలులోనే కనిపిస్తారట. ఆయనకు, కూతురి పాత్రను చేస్తోన్న శ్రీలీలకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయని తెలిసింది. అలాగే, ఫ్లాష్‌బ్యాక్ వచ్చే యాక్షన్ సన్నివేశాలు దుమ్ము దులిపేలా ఉంటాయని టాక్. మొత్తంగా ఈ చిత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేబోతుందట.


Click it and Unblock the Notifications











