సర్‌ప్రైజ్: బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంత త్వరగా వచ్చేస్తుందా!
టాలీవుడ్‌లో మరే సీనియర్ హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఊపులోనే ఆయన మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా ఇప్పుడు ఈ సీనియర్ హీరో.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్రతో తన 109వ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇటీవలే వచ్చిన పోస్టర్ల ద్వారా రివీల్ అయింది. అంతేకాదు, ఇది డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తీస్తున్నారు.

విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇప్పుడు కూడా ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను జెట్ స్పీడుతో జరుపుకుంటోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ అయినా దీని సంబంధించిన అప్‌డేట్లు మాత్రం పెద్దగా రాలేదు. ముఖ్యంగా ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దానిపై కూడా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా విడుదల గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూలైలోనే విడుదల చేయబోతున్నారట. అంతేకాదు, చిత్ర యూనిట్ ఇప్పటికే జూలై 19 లేదా జూలై 26 డేట్లను పరిశీలిస్తుందని తెలిసింది. ఈ రెండింటిలో ఒకటి ఫిక్స్ అయిన తర్వాత దీన్ని అధికారికంగా వెల్లడించబోతున్నారని సమాచారం. అంటే ఈ మూవీ అనుకున్న దానికంటే ముందే వస్తుందన్న మాట.
ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











