బాలకృష్ణే దగ్గరుండి ...పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్లాడా ?
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న వార్తలు రెండు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకటి రెండు ఖండనలతో అది మీడియా హడావిడిగా ఆగిపోయింది. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడి వద్దకు తీసుకెళ్ళింది బాలకృష్ణ అని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. తాజాగా ఈ విషయమై ఇండియన్ ఎక్సప్రెస్ గ్రూప్ కు చెందిన ఎపీ వీక్లీ ఓ వార్తను ప్రచురించింది.
ఆ వార్త ఉన్నదున్నట్లుగా...
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న సంకేతాలు మరింత బలపడుతున్నాయి. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడి వద్దకు తీసుకెళ్ళింది బాలకృష్ణ అని ఆలస్యంగా వెల్లడైంది. పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసినప్పుడు నాగబాబు వెంట ఉన్నట్టు రూఢీగా తెలుస్తోంది. వారు చంద్రబాబు చాంబర్‌లోకి వెళ్ళినప్పుడు బాలయ్య అక్కడే ఉన్నారని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచీ స్వతంత్ర భావాలున్నాయి. అన్న చిరంజీవి అంటే అయనకు భయం, భక్తి ఉన్నాయి. అంత గొప్ప అన్నయ్యకు తమ్ముడిని కావడం తన అదృష్టమని పవన్ అంటూ ఉంటారు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పవన్‌కు నచ్చలేదు. తాను దైవంగా భావించే అన్నగారికి చెప్పలేక, మింగలేక, కక్కలేక ఇంతకాలం పవన్ కాలం గడిపారు. సినిమాలు వరుసగా ఉండటంతో రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచించే సమయం దొరకలేదు.
అయినా కాంగ్రెస్‌పై తనకున్న వ్యతిరేకత ఆయనను ఒకచోట కూర్చోనివ్వడం లేదు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసినప్పుడు పవన్ ప్రధానంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకున్నారు. ''కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి కొడతాం'' అన్న ఆయన డైలాగ్ గొప్పగా పేలింది. చిరంజీవి తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పొగడడం పవన్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు. పవన్ భావనలను ఉమ్మడి మిత్రుల ద్వారా తెలుసుకున్న బాలయ్య పవన్‌కు చంద్రబాబుకు మధ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఆ పత్రికలో వచ్చిన వార్త...దీన్ని బట్టి మళ్లీ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అంత పెద్ద సంస్ధకు చెందిన వెబ్ పత్రికలో వచ్చిన వార్త కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ విషయమై నిజమా..కాదా అని పవన్ ఏదన్నా ప్రకటన చేస్తే బాగుంటుంది.


Click it and Unblock the Notifications











