బాలయ్య వందో చిత్రం కోసం అంతకాలం ఆగాలా?
హైదరాబాద్: బాలకృష్ణ తన తాజా చిత్రం డిక్టేటర్ విజయోత్సాహంలో ఉన్నారు. మరో ప్రక్క ఆయన తన వందో చిత్రం అఫీషియల్ గా ప్రకటించి నందమూరి అబిమానులకు ఆనందం కలుగచేసారు. వందో చిత్రంగా రూపొందనున్న ‘ఆదిత్యా 369' చిత్రానికి సీక్వెల్ ‘ఆదిత్యా 999' ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదనేది అందరికీ ఆసక్తే.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వందో చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. అంటే 2017కి బాలయ్య ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాడన్నమాట. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని ఆయన భావిస్తున్నారు. విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ కు ఎక్కువ సమయం పట్టనుండటంతో ఈ మాత్రం టైమ్ పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లు ఈ వందో చిత్రం రూపొందనుంది.

గత కొద్ది కాలంగా నందమూరి అబిమానుల్లో ఉన్న ప్రశ్న... నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది? ఎలాంటి చిత్రం చేస్తారు? ఈ ప్రశ్నకు మొన్నీ మధ్యే సమాధానం దొరికింది. హైదరాబాద్‌లో జరిగిన 'డిక్టేటర్' విజయోత్సవంలో వందో చిత్రం గురించి బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు.
పాతికేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను చేసిన 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా రూపొందనున్న 'ఆదిత్య 999' తన వందో చిత్రమని తెలిపారు. ఈ సీక్వెల్ కూడా సింగీతం దర్శకత్వంలోనే రూపొందనుందని చెప్పారు. ఇప్పటికే స్టోరీబోర్డ్‌తో సహా సిద్ధమైన ఈ కథ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
సింగీతం మాట్లాడుతూ..."బాలకృష్ణతో ఆదిత్య 369 కొనసాగింపు చిత్రం కి కథని సిద్ధం చేస్తున్నాం. సినిమాకి ఆదిత్య999 అని పేరు కూడా అనుకుంటున్నాం. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. పాత సినిమాకి ఏం మాత్రం సంబంధం లేని సినిమాగా రూపొందిస్తాం" అంటూ చెప్పుకొచ్చారు . ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు సినీ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











