Bigg Boss: కంటెస్టెంట్‌గా ఏఐ రోబో? ఇక వార్ వన్‌సైడే.. మరమనిషిని మనుషులు ఢీ కొట్టగలరా?
ఇండియాలో మెగా రియాలిటీ షోగా ఉన్న బిగ్‌బాస్ మరోసారి హిందీ సహా అన్ని భాషల్లోనూ అలరించేందుకు సిద్దమైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ షోకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడూ అక్టోబర్‌లో మొదలయ్యే ఈ కార్యక్రమం ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఆగస్ట్‌లోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. జనానికి బోర్ కొట్టించే విధానాలను పక్కనపెట్టి పూర్తిగా కొత్తగా హిందీ బిగ్‌బాస్ సిద్ధమవుతోంది. తాజాగా బిగ్‌బాస్‌కు సంబంధించి మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కంటెస్టెంట్స్ వీరేనా?
ఈసారి కంటెస్టెంట్స్‌గా అలీషా పనన్వార్, రాజ్ కుంద్రా, ధీరజ్ ధూపర్, కృష్ణ ష్రాఫ్, ఫ్లయింగ్ బీస్ట్, మున్‌మున్ దత్తా, కనికా మన్, ఫైసల్ షేక్, అపూర్వ ముఖర్జీయా, డైసీ షా, ఖుషీ దూబే, రామ్ కపూర్, అరిష్ఫా ఖాన్, గౌతమీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కిర్రాక్ ఖాలా అలియాస్ పూజా రెడ్డి కూడా హౌస్‌లో అడుగుపెట్టవచ్చు. తనను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించిందని.. అన్ని అనుకున్న విధంగా జరిగితే బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేక్షకులు తనను చూడొచ్చని ఆమె ఓ వార్త ఛానెల్‌కు తెలిపారు.

ఏఐ టెక్నాలజీతో సవాళ్లు
అన్ని రంగాలలోకి కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అడుగుపెట్టి విధ్వంసం సృష్టిస్తోంది. దీని వల్ల లాభాలు ఎంత ఉన్నాయో? నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని మేధావులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడి వేలాది మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే భవిష్యత్తులో మనిషి జీవితాలను ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే రోబోలను అన్ని రంగాలలో వినియోగిస్తున్నారు. ఇవి మనిషి కంటే వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో పనులను చక్కబెడుతున్నాయి.
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఏఐ
తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌కు ముప్పుగా మారనుందట. ఈసారి హిందీ బిగ్‌బాస్‌లో పెనుమార్పులు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తొలి నుంచి నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్‌బాస్ 19 థీమ్, నామినేషన్స్, టాస్క్‌లు పూర్తిగా కొత్తగా ఉండనున్నాయట. ఈ హైప్‌తో బిగ్‌బాస్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బుల్లితెర, వెండితెర సెలబ్రెటీలు, టాప్ మోడల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, కామన్‌మెన్, కొరియోగ్రఫి, సింగర్ ఇలా అన్ని విభాగాల్లోనూ కంటెస్టెంట్స్‌ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. గతంలో హౌస్‌లోకి గాడిదను, కుక్కును కూడా తీసుకొచ్చి షాకిచ్చారు.
మల్టీటాలెంటెడ్ హబుబు
ఈసారి ఏకంగా ఏఐ రోబోను హౌస్‌లోకి తీసుకురాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ రోబో తాలూకా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఈ రోబో పేరు హబుబు అట. ఇది హిందీ సహా ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుందట. మనిషిలా భావోద్వేగాలను పంచుతూ.. ఇంట్లో పనులన్నీ చకచకా చేసేస్తుందని చెబుతున్నారు. ఈ హబీబు కనుక బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే దానిని ఎదుర్కోనడం మనిషి వల్ల అవుతుందా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆకలి, అలసట ఉండదు. పైగా మనిషి కంటే తెలివైనది కావడంతో వార్ వన్ సైడే అన్న చర్చ జరుగుతోంది. మరి నిజంగానే బిగ్‌బాస్ రియాలిటీ షోలో హబీబు అడుగుపెడుతుందా? లేదంటే హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతారా? అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











