బిగ్ బాస్ షోలోకి బెబక్క రీఎంట్రీ .. తెర వెనుక జోరుగా మంతనాలు
బిగ్‌బాస్ తెలుగు 8 సెకండ్ వీక్‌కు చేరుకుని ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. ప్రతిరోజూ ఒక్కొక్క ఈవెంట్‌ను , టాస్క్‌లను పరిచయం చేస్తూ షోలో ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. బిగ్‌బాస్ ఎక్కడా గాడి తప్పకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలైనా తీసుకుంటారు . షో ఎక్కడైనా స్లోగా ఉన్నట్లు అనుకుంటే చాలు.. అక్కడ మార్పులు తథ్యం. అవసరమైతే మాజీ కంటెస్టెంట్స్, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని కూడా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన చరిత్ర బిగ్‌బాస్ సొంతం.
బిగ్‌బాస్ తెలుగు 8లో రోజు గడిచేకొద్ది డిఫరెంట్ టాస్క్‌లు, కొత్త రూల్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ వారం ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. విష్ణుప్రియ, నిఖిల్, నాగ మణికంఠ, శేఖర్ భాషా, నైనిక , పృథ్వీ, ఆదిత్య ఓం, కిర్రాక్ సీతలు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. హౌస్‌లో రేషన్‌పై కోతపెట్టిన బిగ్‌బాస్ ఎవరికి కావాల్సింది వారే సంపాదించుకోవాలని కండీషన్ పెట్టాడు. లెమన్ పిజ్జా టాస్క్‌లో యాష్మీ టీమ్, కనిపెట్టు పరిగెత్తు టాస్క్‌లో నైనిక టీమ్ గెలిచి సరుకులు సొంతం చేసుకున్నాయి. అయితే రెండు టాస్క్‌ల్లో ఓడిపోయిన నిఖిల్ టీమ్‌కి రాగిపిండి పడేశాడు.

ఈ సీజన్‌లో ప్రైజ్ మనీ జీరో అని చెప్పిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్ తమ ఆట తీరు ఆధారంగా ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారని చెప్పాడు. ఫుడ్ టాస్క్‌ల్లో ఓడిపోయిన నిఖిల్ టీమ్.. ఆ తర్వాత మాత్రం చెలరేగిపోయింది. రోప్ టాస్క్‌లో నిఖిల్ పోరాడి గెలవగా.. స్పెల్లింగ్ టాస్క్‌లో యాష్మీ, నైనికలను ఓడించాడు మణికంఠ. దీంతో నిఖిల్ టీమ్ ప్రైజ్ మనీ ఏకంగా లక్షా 20 వేలకి పెరిగిపోయింది. ఆ తర్వాతి ప్లేస్‌లో 50 వేలతో నైనిక టీమ్ నిలవగా.. తన స్ట్రాటజీలతో హౌస్‌నే కంట్రోల్ చేస్తున్న యాష్మీ టీమ్ అసలు ఖాతానే తెరవలేదు.
ఇంత చేస్తున్నా కంటెస్టెంట్స్ తీరుపై ఏదో ఒక కంప్లయంట్ వస్తూనే ఉంది ప్రేక్షకుల నుంచి . అంతా తిని తొంగునే బ్యాచ్‌లా ఉన్నారని.. గేమ్స్ ఆడకుండా, డిస్కషన్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఎమోషనల్ డ్రామానే ప్లే చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో, సంబంధం లేకుండా ఎవరెవరో వచ్చి వాళ్లని ఓదార్చడమెంటో అర్ధం కాక ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. చప్పగా సాగిపోతున్న సీజన్‌ను పరుగులు పెట్టించే ఉద్దేశంతో లవ్ ట్రాక్‌లు కూడా స్టార్ట్ చేసినా ఏదో వెలితి.

ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు షురూ చేస్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. బిగ్‌బాస్ తెలుగు 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్కెచ్ అద్భుతంగా వర్కవుట్ అయి, మంచి టీఆర్పీలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ వాడాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. మంచి కంటెస్టెంట్స్‌తో పాటు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిన వారిని తీసుకొస్తారని చెబుతున్నారు. తొలివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా.. ఆమె స్థానంలోకి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది.
అయితే ఎవరో ఎందుకు ఆమె వస్తారని మరో గాసిప్ వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ థీమ్‌ను అర్ధం చేసుకోలేక బొక్కబోర్లాపడిన బేబక్క.. తనకు ఓ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటానని చెబుతోంది. ఈ క్రమంలో ఆమెనే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా మరోసారి హౌస్‌లోకి పంపుతారనే సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గత సీజన్‌లో ఎలిమినేట్ అయిన రతిక మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే ప్లాన్‌ను బేబక్క విషయంలోనూ వాడతారని అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











