తెలుగు బిగ్‌బాస్‌లో మరోసారి కన్నడ రాజ్యం? కంటెస్టెంట్స్‌గా ఆ సీరియల్ స్టార్స్?
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 9 కోసం ఏర్పాట్లు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ నిర్మాణం పనుల్లో బిగ్‌బాస్ టీం బిజీగా ఉంది. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసి బిగ్‌బాస్ తెలుగు 9ను లాంఛనంగా ప్రారంభించాలని స్టార్ మా భావిస్తోంది. బిగ్‌బాస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి.. సరికొత్తగా నిర్వహించాలని కూడా నిర్వాహకులు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
కంటెస్టెంట్స్ ఎంపికలో బిగ్‌బాస్ టీమ్
బిగ్‌బాస్ తెలుగు 9ను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పట్టాలెక్కించాలని బిగ్‌బాస్ టీం భావిస్తోంది. ఊరుపేరు లేని కంటెస్టెంట్స్‌ను, సోషల్ మీడియా బ్యాచ్‌ను పక్కనపెట్టి సెలబ్రెటీలతోనే హౌస్‌ను నింపేందుకు పావులు కదుపుతున్నారు. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసి తుది వడపోత తర్వాత 16 మందిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే స్టార్స్, సింగర్స్, బుల్లితెర నటులను బిగ్‌బాస్ సంప్రదించి ఎవరైతే కంటెస్టెంట్స్‌గా రావడానికి ఒప్పుకుంటారో వారిని అన్ని రకాలుగా సిద్ధం చేయనున్నారు.

హోస్ట్‌గా నాగార్జునే?
ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్ట్ విషయంలోనూ పలు ప్రచారాలు జరుగుతుండగా అక్కినేని నాగార్జునే మరోసారి బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగు బిగ్‌బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకోగా.. వాటిలో రెండు తప్పించి మిగిలిన అన్ని సీజన్లకు నాగార్జునే హోస్ట్ చేశారు. బిగ్‌బాస్ అంటే నాగార్జున.. నాగార్జున అంటే బిగ్‌బాస్ అన్నంతగా ఆయన ముద్రవేశారు. స్లైలీష్‌గా ఉండటంతో పాటు వాక్చాతుర్యం, సమయస్పూర్తితో ఈ షోను నాగ్ అద్బుతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కుబేరా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగార్జున.. త్వరలోనే బిగ్‌బాస్ వ్యవహారాల్లోకి అడుగుపెడతారని, ప్రోమో షూటింగ్‌లో పాల్గొంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
కంటెస్టెంట్స్‌గా పలువురి పేర్లు
బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్స్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ, అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య మోక్ష, రీతూ చౌదరి, బుల్లితెర నటి దేబ్‌జనీ మోదక్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత సీజన్‌లో కన్నడ నటులు తెలుగు బిగ్‌బాస్‌పై డామినేషన్‌తో పాటు ఏకంగా టైటిల్‌ను కూడా తన్నుకుపోయారు. నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ఓ గ్రూప్‌గా ఆడి తెలుగు కంటెస్టెంట్స్‌ను దెబ్బకొట్టారనే టాక్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై మండిపడ్డారు. వీళ్లంతా గ్రాండ్ ఫినాలే వరకు తమ హవా చూపించారు. వీరి కోసం బలమైన కంటెస్టెంట్స్‌ను బలి చేశారంటూ ఆయా కంటెస్టెంట్స్ ఆరోపించారు కూడా.
మరోసారి కన్నడ డామినేషన్?
తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9లోనూ కన్నడ నటీనటుల డామినేషన్ ఉంటుందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.. తెలుగు బుల్లితెరపై ఏ టీవీ ఛానెల్ చూసినా కన్నడ నటీనటులే కనిపిస్తారు. అలాంటప్పుడు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వాళ్లే ఎక్కువగా అడుగుపెట్టడంలో ఏమాత్రం ఆశ్చర్యం కనిపించదు. తాజాగా వైరల్ అవుతున్న లిస్ట్‌లో అమర్‌దీప్ భార్య తేజస్వినీ గౌడ, నవ్య స్వామితో పాటు మరో ఇద్దరు కన్నడ నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ.. ఒకవేళ గతంలో మాదిరిగా కన్నడ డామినేషన్ కనిపిస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు తప్పవు.


Click it and Unblock the Notifications











