టాలీవుడ్ హీరోయిన్లే టార్గెట్ .. కరణ్ పవర్‌ఫుల్ స్కెచ్, ఒక దెబ్బకు రెండు పిట్టలు ఔట్
భారతీయ చిత్ర పరిశ్రమ మార్కెట్ పరిధి, విస్తృతి నానాటికీ పెరుగుతోంది. అనేక దేశాలలో మన సినిమాలు విడుదలవుతూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇండియాలో ప్రతియేటా ఎన్నో భాషల్లో వేలాది సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే మనదేశంలో హిందీ సినిమాదే డామినేషన్. పాన్ ఇండియా సినిమాల జైత్రయాత్ర చేస్తున్నా, టాలీవుడ్ దూసుకొస్తున్నా బాలీవుడ్ బాలీవుడ్డే.
మనదేశంలో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మల నుంచి అప్పుడే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వారి వరకు అంతిమ లక్ష్యం బాలీవుడ్డే. దేశ, విదేశాల్లో పేరు, ప్రఖ్యాతులు, కళ్లు చెదిరే రెమ్యునరేషన్ , పరిగెత్తుకొచ్చే బ్రాండ్ అండార్స్‌మెంట్లు తదితర అంశాలు ఇందుకు కారణం. ఏదో ఒక ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు తెచ్చుకుని తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని పలువురు ట్రై చేస్తుంటారు. కానీ వీరిలో సక్సెస్ అయ్యేది కొందరే.

ఇక సౌత్ నుంచి బాలీవుడ్‌లోకి వెళ్లిన హేమామాలిని, శ్రీదేవి, జయప్రద, ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనే వంటి వారు సక్సెస్ కొట్టారు. వీరు చూపిన బాటలోనే కొందరు సౌత్ ముద్దుగుమ్మలు హిందీ ఇండస్ట్రీలో గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ కొందరినీ మాత్రమే అదృష్టం వరిస్తుండగా.. మరికొందరు మాత్రం రెంటికి చెడ్డ రెవడిలా మారుతున్నారు. బాలీవుడ్‌లో సినిమాలు హిట్ కాక.. సొంత ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోతున్నారు.
ప్రస్తుతం సౌత్ నుంచి వెళ్లిన రష్మిక మందన్న, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ వంటి వారు హిందీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వీరి ప్రయత్నాలు ఏమంత ఆశాజనకంగా లేవు. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మల గురించి ఓ హాట్ న్యూస్ బీ టౌన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలీవుడ్ దర్శక నిర్మాత, హిందీ ఇండస్ట్రీలోని పెద్ద మనుషుల్లో ఒకరిగా చెప్పుకునే కరణ్ జోహార్ ఈ హీరోయిన్ల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాడట. వీరందరిని కలిపి ఓ సినిమా తీయాలని కరణ్ భావిస్తున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తీయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో కొందరు బాలీవుడ్ స్టార్స్‌ని కూడా భాగం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చేయడం వెనుక కరణ్ పెద్ద ప్లాన్ కూడా ఉంది. వీరికి తోటి హిందీ సెలబ్రెటీల మాదిరిగా భారీగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హిందీలో ఎలాగూ తన పేరు మీద బిజినెస్ జరిగిపోతుంది.. ఈ భామలు సౌత్‌లో ఫేమస్ కాబట్టి ఇక్కడా వ్యాపారం దుమ్మురేపుతుంది. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కరణ్ ప్లాన్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











