పాత రోజుల్లోకి తీసుకెళ్లనున్న భీమ్లా నాయక్.. టికెట్ల కోసం 'క్యూ' కట్టాల్సిందే.. ఆ సమస్య తేలకపోతే ఇబ్బందే?
మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒకరకంగా పండుగ చేసుకుంటారు. మొదటి రోజే సినిమా చూసేందుకు పనులన్నీ మానుకుని మరీ సిద్ధంగా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఏపీలో ఇప్పుడు పరిస్థితి బాలేదు కానీ ఒకప్పుడు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో మొదలుకుని ఏమి చేసి అయినా మొదటి రోజు సినిమా చూడాలని భావిస్తారు. ఒకప్పుడు అలా మొదటి రోజు టికెట్లు సంపాదించడం కోసం థియేటర్ల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు బుక్ మై షో లాంటి యాప్స్ వచ్చాయి కాబట్టి ఈజీగానే కొనుక్కుంటున్నారు. కానీ నైజాంలో ఈసారి బుక్ మై షోలో భీమ్లా నాయక్ టికెట్లు దొరికే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

విడుదలకు సిద్దం
వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా మీద మొదటి నుంచి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమా నుంచి ప్రమోషనల్ స్టఫ్ కూడా విడుదల అవుతోంది. మొన్ననే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు కూడా పంపారని ఎలాంటి కట్స్ లేకుండా ఒకటి రెండు చోట్ల మ్యూట్ పెట్టాలని కోరి యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అంటున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సి ఉండేది. కానీ షూట్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసి ఫిబ్రవరి 25నే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 21న గ్రాండ్ గా నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ భారీ ఈవెంట్ కోసం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ ను వేదికగా ఫిక్స్ చేసారు కూడా. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిధులుగా ఈ వేడుక జరగబోతోంది. భీమ్లా నాయక్ ట్రైలర్ ను కూడా అదే రోజు అతిధులు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.

బుక్ మై షో కి ఎదురుదెబ్బ
అయితే ఇప్పుడు ఈ సినిమా బుకింగ్ విషయంలో కొంత సమస్య తలెత్తింది అని అంటున్నారు. ఒకరకంగా సినిమా టికెట్ల బుకింగ్ యాప్ బుక్ మై షో కి నైజాంలో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది అని అంటున్నారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ నిర్ణయంతో ఏరియా మొత్తం మీద ఒక్క థియేటర్ కూడా బుక్ మై షో ద్వారా టికెట్ లు అమ్మకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద మరీ ఎక్కువ అదనపు భారం పడుతోందని సినిమా పెద్దలు భావిస్తున్నారట. ఈ విషయం మీద కొద్దీ రోజుల క్రితం సునీల్ నారంగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు కూడా.

రాక్షసి
గతంలో, సునీల్ నారంగ్ బుక్ మై షోను చిత్ర పరిశ్రమ సృష్టించిన ఒక రాక్షసి అని పేర్కొన్నారు. "మా థియేటర్లలో ఒకదానిలో ఆన్‌లైన్ టికెటింగ్ సదుపాయం ఒక రోజు అందుబాటులో లేని సమయంలో ఇది జరిగింది. కౌంటర్ బుకింగ్‌లు లేకపోవడంతో ఆ రోజంతా ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు, ఆ పద్ధతి మారాలి అంటే ఈ పోర్టల్ పోవాలని ఆయన పేర్కొన్నారు. అయితే బుక్ మై షోతో ప్రేక్షకులు సినిమా హాళ్లలో క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా టికెట్లు కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. కానీ పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటోంది అని మాత్రం తెలుస్తోంది.
Recommended Video

ఏం జరగనుంది?
ఆ కమిషన్ల వ్యవహారం సెటిల్ అయ్యే వరకు కౌంటర్ ల్లోనే విక్రయించాలని ఎగ్జిబిటర్లకు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. దానికి ముఖ్య కారణం ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ అమౌంట్ కి బుక్ మై షో కమిషన్ కలిపితే రేట్లు ఇంకా పెరిగాయని అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే టికెట్ బుకింగ్స్ మీద గట్టి ప్రభావం కనబరిచే అవకాశం ఉంది. అందుకే కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్మాతలు నిర్ణయించి డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ కమిషన్ల వ్యవహారంలో బుక్ మై షో యాజమాన్యం దిగి వస్తే అప్పుడు మళ్లీ ఆలోచించవచ్చు అని భావిస్తున్నారట. ప్రేక్షకులపై మరీ ఎక్కువ భారం పడుతుంది కాబట్టి ఇలా నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అదే జరిగితే హైదరాబాద్ లాంటి చోట్ల కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











