బోయపాటి శ్రీనుకు రికార్డు రెమ్యునరేషన్.. అఖండ 2 ఎన్ని కోట్ల పారితోషికమంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ డైరెక్టర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు బోయపాటి శ్రీను. హీరోయిజాన్ని పీక్స్‌లో చూపిస్తూ ఆయన ఇచ్చే ఎలివేషన్స్‌కు బాక్స్‌లు బద్ధలు కావాల్సిందే. ఎలాంటి క్లాస్ హీరో అయినా సరే .. బోయపాటి చేతిలో పడితే మాస్ హీరోగా టర్న్ అవ్వాల్సిందే. పవర్‌ఫుల్ డైలాగ్స్, చెవులు హోరెత్తించే బీజీఎంలు, యాక్షన్ ఎపిసోడ్స్‌తో థియేటర్లు దద్ధరిల్లాల్సిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ 2ని తెరకెక్కిస్తున్నారు బోయపాటి శ్రీను. అఖండకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
బాలయ్య- బోయపాటిది తిరుగులేని కాంబో
బాలకృష్ణ - బోయపాటిది తిరుగులేని కాంబినేషన్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలయ్యకు సింహతో సాలీడ్ హిట్ ఇచ్చారు బోయపాటి. బాలకృష్ణ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఈ సినిమాను తెరకెక్కించారు శ్రీను. ఈ చిత్రం తర్వాత లెజెండ్, అఖండ చిత్రాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ అందించారు బోయపాటి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 తెరకెక్కుతోంది.

సెప్టెంబర్ 25న అఖండ 2
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లేటెస్ట్‌గా ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌తో వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్నారు బాలయ్య. ఈ క్రమంలోనే అఖండ 2 షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహాకుంభమేళాతో పాటు హిమాలయాల్లోని అందమైన లోకేషన్‌లలో అఖండ 2 చిత్రీకరణ జరుపుకుంది. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 విడుదల కానుంది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన అఖండ 2 టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలయ్య పారితోషికం ఎంతంటే?
మరోవైపు అఖండ 2 బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లు ఇవేనంటూ ఫిలింనగర్‌లో వార్తలు అవుతున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు 160 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. ముందుగా హీరో నందమూరి బాలకృష్ణ విషయం చూస్తే.. ఆయనకు ఏకంగా రూ.45 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట. వరుస హిట్స్‌తో ఊపులో ఉన్న బాలయ్యకు తన పారితోషికాన్ని భారీగా పెంచేశారట. డాకు మహారాజ్‌కు రూ.28 కోట్లు తీసుకున్న ఆయన.. అఖండ 2 కోసం 17 కోట్ల రూపాయల పైనే పెంచేశారని టాక్. అయినప్పటికీ బాలకృష్ణ రెమ్యునరేషన్.. మిగిలిన హీరోలతో పోలిస్తే తక్కువేనని అంటున్నారు విశ్లేషకులు.
బోయపాటికి కెరీర్‌లోనే హయ్యెస్ట్
ఇక అఖండ 2కి సంగీత దర్శకుడుగా ఉన్న థమన్‌కు బాలయ్య కారు గిఫ్ట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇందుకు కావాల్సిన డబ్బును నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట ఇచ్చినట్లుగా టాక్. తన రెమ్యునరేషన్‌లో నుంచి కట్ చేసి కొంత మొత్తంతో బాలయ్య ఈ కారును గిఫ్ట్‌గా ఇచ్చారని ఫిలింనగర్‌లో చెబుతున్నారు. మరోవైపు అఖండ 2 దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేశారని టాక్. ఈ చిత్రం కోసం ఆయన దాదాపు 40 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద అందుకున్నారట. ఈ వార్తలను బట్టి హీరో బాలయ్య తర్వాత సెకండ్ టాప్ రెమ్యునరేషన్ బోయపాటిదే. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











