బాలకృష్ణ- బోయపాటి అఘోరా ప్రయత్నాలు.. కాశీకి పయనం.. ప్లాన్ ఇదే!
నందమూరి నటసింహ బాలకృష్ణకు ఈ ఏడాది చాలా కీలకంగా మారింది. గతేడాది ఆయన చేసిన సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఈ ఏడాది ఆ లోటు తీర్చేలా బాలయ్యబాబు పకడ్బందీ స్కెచ్ వేశారు. ఈ మేరకు ముందుగా తన సక్సెస్‌ఫుల్ కాంబో బోయపాటి శ్రీనుతో బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా రెగ్యులర్ షూట్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుందని తాజా సమాచారం.
బాలకృష్ణ కెరీర్ లో 106వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం.. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని బాలయ్య ఇచ్చిన సూచనల మేరకు కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ పట్టుకొని రెడీ అయ్యారు బోయపాటి. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా కథ సిద్ధం చేశారట. అయితే ఈ సినిమాలో బాలయ్యబాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.

అందులో ఒకటి అఘోరా రోల్. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ పాత్ర చేసేందుకు బాలయ్య రెడీ అయ్యారట. ఈ మేరకు తొలి షెడ్యూల్ అంతా బాలకృష్ణ అఘోరా గెటప్‌పైనే షూట్ చేయాలని బోయపాటి స్కెచ్ రెడీ చేశారట. ఇందుకోసం వారణాసి లొకేషన్ చూజ్ చేసుకున్న ఆయన.. అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారట.
ప్రసిద్ద పుణ్య క్షేత్రాలు వెలిసిన ప్రాంతం వారణాసి (కాశీ). దైవ, దుష్ట శక్తులను కొలిచే పవిత్ర స్థలంగా కాశీని పిలుస్తారు. అఘోరాలు సంచరించే ప్రాంతం కూడా ఇదే. అందుకే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారట బాలకృష్ణ. సో చూడాలి మరి బాలకృష్ణ- బోయపాటి అఘోరా ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో!.


Click it and Unblock the Notifications











