ఎఫ్3 అందుకే లేట్.. వెంకటేష్ డిమాండ్ మామూలుగా లేదని టాక్
గత సంక్రాంతికి ఎఫ్2 సినిమాను సంక్రాంతి బరిలో నిలబెట్టి భారీ హిట్ కొట్టాడు నిర్మాత దిల్ రాజు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్‌లకు ఎఫ్2 బాగా ఉపయోగపడింది. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడంతో వీరి కెరీర్ ఊపందుకుంది.

బిజీగా మారిన వెంకీ..
ఎఫ్2 ఏ ముహుర్తాన విడుదలై వంద కోట్లకు పైగా కొల్లగొట్టిందో కానీ వెంకీకి మాత్రం ఎక్కడలేని ఎనర్జీని తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత వెంకటేష్ బిజీగా మారిపోయాడు. గతేడాది ఎఫ్2, వెంకీమామ లాంటి హిట్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

ప్రస్తుతం నారప్పతో..
ఎఫ్2 ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వెంకటేష్ వరుసగా ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అసురన్ రీమేక్ అయిన నారప్ప చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఎఫ్3 కోసం ముందడుగు..
ఎఫ్2 భారీ హిట్టు కొట్టాక సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తామని అప్పట్లోనే ప్రకటించాడు దర్శకనిర్మాతలు. అయితే వాటి కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని టాక్.అయితే ఇందులో ముగ్గురు హీరోలు ఉంటారని, అందులో వరుణ్ తేజ్, వెంకీ ఫిక్స్ అని తెలుస్తోంది. అయితే ఇక్కడే నిర్మాతకు ఓ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది.

భారీ రెమ్యూనరేషన్..
ఈ సినిమాకు గానూ వెంకటేష్ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నిర్మాణంలోనూ సురేష్ ప్రొడక్షన్స్‌ను భాగస్వామిని చేయాలని అడుగుతున్నాడని సమాచారం. అయితే వీటితో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడట. ఈ విషయంలో ఏదో ఒకటి తెగితే గానీ ఎఫ్3 ముందుకు కదలదని సమాచారం.


Click it and Unblock the Notifications











