Chiranjeevi: చిరంజీవికి సర్జరీ? అందుకే ప్రమోషన్లకు దూరమా?
Chiranjeevi: నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడు కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasadgaru)’ మూవీతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి సరసన నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమా చుట్టూ బజ్ మరింత పెరిగింది.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార కూడా ఈసారి రంగంలోకి దిగడం విశేషం. తనదైన శైలిలో ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాకు మంచి బజ్ తీసుకొస్తున్నారు. అయితే ఈ హడావుడి మధ్య మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటివరకు ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కూ హాజరు కాకపోవడం అభిమానుల్లో అనేక అనుమానాలకు దారి తీసింది.

మోకాలి సర్జరీ కారణమేనా?
చిరంజీవి ప్రమోషన్లకు దూరంగా ఉండటానికి కారణం ఆరోగ్య సమస్యలేనన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి కొంతకాలంగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, గతంలో ఒకసారి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మోకాలి సమస్య తీవ్రతరం కావడంతో చిన్న సర్జరీ చేయించుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సంక్రాంతికి సినిమా రిలీజ్ కావాల్సి ఉండటంతో, ఎంత నొప్పి ఉన్నా సరే 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్‌ను పూర్తి చేశారని సమాచారం. షూటింగ్ పూర్తయిన వెంటనే సర్జరీ చేయించుకున్నారని, అందుకే ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్‌కు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిరంజీవి టీమ్ గోప్యంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరు సందడి?
ఇక ఈ వారంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు చిరంజీవి తప్పకుండా హాజరవుతారని, అక్కడి నుంచే ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను మొదలుపెడతారని సమాచారం. అలాగే మీడియా ఇంటర్వ్యూల్లోనూ చిరంజీవి కనిపించనున్నారని తెలుస్తోంది. సర్జరీ విజయవంతంగా పూర్తవడంతో, ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడుతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
సినిమా భారీ అంచనాలు
ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చిరంజీవి లుక్స్, గ్రేస్, కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారన్న విషయం ఇప్పటికే ఆసక్తిని పెంచింది. ఇంకా ఒక పాట విడుదల కావాల్సి ఉండగా, అది ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే రిలీజ్ చేసే అవకాశముందని టాక్.
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేసినా, త్వరలోనే ఆయనే స్వయంగా ప్రమోషన్లలో కనిపించనున్నారన్న సమాచారం ఊరటనిస్తోంది. జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











