చిరుకు జోడీగా ఐశ్వర్యరాయ్.. చరణ్‌ను ఒప్పించిన బడా డైరెక్టర్
Recommended Video
'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఊపులోనే తన 151వ సినిమా 'సైరా: నరసింహారెడ్డి'ను కూడా పట్టాలెక్కించేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎందరో ప్రముఖ నటులు నటిస్తున్నారు.

కొరటాలకు గ్రీన్ సిగ్నల్
ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరు ‘సైరా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అంతకంటే ముందు అంటే చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిసింది.

చిరు సరసన ఐష్
మెగాస్టార్‌తో అవకాశం రావడంతో కొరటాల శివ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా చిరు సరసన నటించే హీరోయిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్. ఈ సినిమా కోసం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించబోతున్నట్లు సమాచారం.

రామ్ చరణ్‌ను ఒప్పించాడట
ప్రతిష్టాత్మక చేస్తున్న సినిమా కావడంతో ఐశ్వర్యరాయ్‌ను తీసుకునే విషయంలో నిర్మాత రామ్ చరణ్‌ను ఒప్పించాడట కొరటాల శివ. ఈ మేరకు చరణ్ నుంచి హామీ తీసుకున్న ఈ బడా డైరెక్టర్ త్వరలోనే ఐష్‌ను కలిసి, స్క్రిప్ట్ వినిపించబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ప్రాముఖ్యం ఉండేలా ప్లాన్ చేశారని, దీంతో ఐష్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

చిరు డబుల్ రోల్
ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తన కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో సైతం ఆయన డబుల్ రోల్ చేశారు. ఇక, కొరటాల సినిమాలోనూ అది రిపీట్ చేయబోతున్నారని సమాచారం. ఇందులో చిరు తండ్రి, కొడుకుగా కనిపించబోతున్నారట. ఈ రెండు పాత్రలూ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని టాక్.

‘సైరా: నరసింహారెడ్డి' గురించి..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార, తమన్నా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.


Click it and Unblock the Notifications











