'నారప్ప' షూటింగ్ కష్టాలు.. అందుకే అలా ప్లాన్ చేశారట!
విక్టరీ వెంకటేష్ 'నారప్ప'గా సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. తమిళంలో 'అసురన్' పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుంచనున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లొకేషన్స్‌లో చిత్రయూనిట్ కొన్ని కష్టాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్రయూనిట్ తమిళనాడులో షూటింగ్ చేస్తోంది. అక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ సాంగ్ షూట్ అనంతపురంలో జరగాల్సి ఉండగా, అక్కడ జనసందోహం ఎక్కువగా ఉండి కొన్ని సమస్యలు తలెత్తడంతో దానిని తమిళనాడులోకి ఓ పల్లెటూరుకు మార్చేశారు. షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లోకి జనం చొచ్చుకుని రావడం, షూట్ చేస్తుండగా చుట్టుపక్కల జనం సెల్‌ఫోన్లలో రికార్డ్ చేస్తుండటం చిత్రబృందానికి ఇబ్బంది కలిగించిందట. అందుకే అనంతపురం నుంచి తమిళనాడుకి లొకేషన్ షిఫ్ట్ చేసినట్లు టాక్.

తమిళనాడులోని కోవిల్ పట్టి అనే గ్రామంలో షూట్ చేస్తున్న చిత్రయూనిట్.. మరో నెల రోజుల పాటు ఇక్కడే షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి, అమలాపాల్ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ కన్ఫర్మ్ చేస్తూనే విడుదల చేసిన నారప్ప లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో షూటింగ్ సమయంలోనే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.


Click it and Unblock the Notifications











