పద్మభూషణ్...అంటూ దాసరి విసుర్లు ఎవరిపై?
'పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు తెచ్చుకున్న పెద్దల్ని తెలుగు చిత్ర పరిశ్రమ భుజాలమీద ఎత్తుకొని, పల్లకీ మోస్తూ పదే పదే సన్మాలు చేస్తుందనీ, అదే ఓ తెలుగు కుర్రాడికి జాతీయ అవార్డు వస్తే అతన్ని ప్రోత్సహించడానికీ, సత్కరించుకోడానికీ మాత్రం ముందుకురాదు' అంటూ దర్శక రత్నదాసరి మరోసారి టాలీవుడ్ పరిశ్రమ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
'అరణ్య కాండం' అనే తమిళ సినిమాకు ఎడిటర్ గా పని చేసి జాతీయ స్థాయి ఉత్తమ ఎడిటర్ అవార్డు గెలుచుకున్న తెలుగు కుర్రాడు కె.ఎల్. ప్రవీణ్‌కు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో దాసరి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే దాసరి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చిరంజీవిని, డి. రామానాయుడిని టార్గెట్ చేశారనే గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.
చిరంజీవికి పరిశ్రమలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆక్రోశం ఆయన విమర్శల్లో కనిపిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో దాసరి-చిరంజీవి మధ్య చాలా విబేధాలు పొడ చూపాయి. సీని జనాల్లో ఇలాంటి అనుమానాలు రావడానికి ఆ సంఘటనలు కూడా కారణం అనే వాదన వినిపిస్తోంది.
దాసరి విమర్శలను బట్టి తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై లేదని స్పష్టం అవుతోంది. పరిశ్రమలోని పెద్దల మధ్య సమన్వయం లేదని, అందుకు దాసరి విమర్శలే కారణమని అంటున్నారు. ఇలా అయితే పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కష్టమని అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











