అధినాయకుడు, దమ్ము సినిమాలపై ప్రెషర్!
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజా సినిమా 'అధినాయకుడు' ఏప్రిల్ 19న విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు మరొక నందమూరి హీరో జూ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' చిత్రం కూడా ఇదే నెలలో 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి అధినాయకుడు సినిమా ఈ రోజు(ఏప్రిల్ 12)న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విడుదల 19 వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు నందమూరి హీరోల సినిమాల మధ్య గ్యాప్ కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో రెండు చిత్రాల నిర్మాతల్లోనూ ఆందోళన నెలకొంది.
ఒక వేళ ఏ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా...ఆ సినిమా భారీగా నష్ట పోతుందని, అంతా బాగుండి రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా రెండు సినిమాలు ఒకేసారి ఆడటం వల్ల కలెక్షన్లు తగ్గిపోయని నిర్మాతలు భయ పడుతున్నారు. మరో వైపు అభిమానులు కూడా రెండు సినిమాలు ఒకేసారి రావడంపై అసంతృప్తిగా ఉన్నారు.
అయితే ఈ రెండు సినిమాల్లోకెల్లా 'అధినాయకుడు' సినిమాపైనే ఎక్కువ ఒత్తిడి ఉందని, ఆ సినిమా నిర్మాతలు విడుదలపై డైలమాలో ఉన్నారని, అందుకే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు అనే వాదన ఫల్మ్ నగర్లో వినిపిస్తోంది. అధినాయకుడు సినిమా A సర్టిఫికెట్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ రాక తగ్గిపోతుందని, సమ్మర్లో కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చే వారు ఇతర సినిమాల వైపు మళ్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారట.


Click it and Unblock the Notifications











