‘ధురంధర్' బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!
స్టార్ హీరోయిన్ సారా అర్జున్ (Sara Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్న, పొన్నియన్ సెల్వన్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఇటీవల సారా అర్జున్ 'ధురంధర్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో సారా అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడీ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే యుఫోరియా సినిమాలతో తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పాత్రకు సిద్ధమవుతోంది. ఈ అమ్మడు ఓ లెజండరీ నటి బయోపిక్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ లో నటించబోతుందట. ఇంతకీ ఆ పాత్ర ఏంటీ? ఆ బయోపిక్ ఏంటీ?
భారతీయ సినిమా దిగ్గజం, ఎవర్ గ్రీన్ బ్యూటీ మధుబాల జీవితం త్వరలో వెండితెరపై బయోపిక్ రూపంలో ఆవిష్కృతం కానుందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు కొత్త ఊపు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం మొదట పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించినా, చివరకు సారానే సరైన ఎంపికగా భావించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో నటి సాయి పల్లవి పేరుగు కూడా గట్టిగా వినిపించింది. కానీ, ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని టాక్. దీంతో యువనటి సారా అర్జున్ పేరు వినిపించడంతో ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న సారా.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక పాత్రను పోషించబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ బయోపిక్‌కు 'డార్లింగ్స్' ఫేమ్ దర్శకురాలు జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. భన్సాలీ పేరు రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే పీరియడ్ డ్రామాలు, విజువల్ గ్రాండియర్, భావోద్వేగ కథనాల విషయంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1950ల నాటి సినీ ప్రపంచాన్ని, మధుబాల గోల్డెన్ ఎరాను తిరిగి తెరపై చూపించేందుకు భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మధుబాల పాత్ర అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు. ఇదోక క్లిష్టమైన పాత్ర. అందుకే సారా అర్జున్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే మధుబాల ఐకానిక్ లుక్స్‌ను రీక్రియేట్ చేయడానికి అనేక లుక్ టెస్టులు జరుగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కేవలం మధుబాల విజయగాథ మాత్రమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితంలోని చేదు నిజాలు, ప్రేమ కథలు, ఆరోగ్య సమస్యలు, స్టార్‌డమ్ వెనుక ఉన్న ఒంటరితనం వంటి అంశాలను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె జీవితంలో కీలక పాత్ర పోషించిన దిలీప్ కుమార్, కిషోర్ కుమార్ వంటి వ్యక్తుల పాత్రలు కూడా సినిమాలో ప్రధానంగా ఉండనున్నాయట. ఆ పాత్రల కోసం ప్రముఖ నటులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా? లేక నేరుగా ఓటీటీలో తీసుకురావాలా? అన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరాలంటే ఓటీటీ మంచి వేదిక అవుతుందని కొందరు భావిస్తుండగా, భన్సాలీ స్థాయి విజువల్ ప్రాజెక్ట్ కాబట్టి థియేటర్లకే సరిపోతుందని మరికొందరు అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలా మధుబాల బయోపిక్ ఇప్పుడు భారతీయ సినీ రంగంలో అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్‌గా మారింది. సారా అర్జున్ ఈ పాత్రలో ఎంతవరకు ఒదిగిపోతుంది? మధుబాల మాయాజాలాన్ని మళ్లీ తెరపై చూపించగలదా? అన్న ప్రశ్నలు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా వస్తే, సారా అర్జున్ కెరీర్‌కు ఇది మరో టర్నింగ్ పాయింట్ అవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications



