బాలయ్యతో దిల్ రాజు సినిమా? దర్శకుడు ఎవరో తెలుసా?
'ఎన్టీఆర్ బయోపిక్' తర్వాత బాలయ్య చేయబోయే సినిమా ఎమిటనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఇప్పటికే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్క్రిప్టుకు సంబంధించిన ఇష్యూతో సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత జనగ్ గెలుపు నేపథ్యంలో కథలు మార్పులు చేస్తున్నారట.
మరో వైపు బాలయ్యతో సినిమా చేయాలని బోయపాటి వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆగిపోవడంతో ఈ మూవీకి మార్గం సులగమం అయినట్లు తెలుస్తోంది. ఇది అందరూ ఊహించిన విషయమేకానీ... ఎవరి ఊహకు అందని పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారట.

ఇప్పటి వరకు దిల్ రాజు, బాలయ్య కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇదే నిజమైతే వీరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కానుంది. ఇక బోయపాటికి కూడా దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దిల్ రాజు బేనర్లో సినిమా చేయడానికి సిద్దమయ్యారు. పద్నాలుగేళ్ల క్రితం దిల్ రాజు నిర్మాతగా బోయాపటి 'భద్ర' చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల కాంబినేషన్ అంటేనే అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ఈ ప్రాజెక్టులోకి దిల్ రాజు లాంటి బడా నిర్మాత వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇటు దిల్ రాజు నుంచి కానీ, అటు బోయపాటి నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. ప్రస్తుతం దిల్ రాజు బేనర్లో ఇప్పటికే ఇద్దరి లోకం ఒకటే, 96, పలుకే బంగారమాయే, వి, ఐకాన్, నాగ చైతన్య నెక్ట్స్ మూవీ, వివి వినాయక్ హీరోగా డెబ్యూ మూవీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇపుడు బాలయ్య-బోయపాటి మూవీ కూడా ఒకే అయితే ఒకేసారి 8 సినిమాలు సెట్స్ మీదకు వెళ్లినట్లు అవుతుంది.


Click it and Unblock the Notifications











