ఒకేసారి పదిమంది హీరోయిన్లతో యువ డైరెక్టర్ ప్రయోగం... అ! లాంటి ప్రయోగం?
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలతో నేటి తరం యువ దర్శకులు ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను అయితే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రయోగాత్మకమైన సినిమాలు వస్తే మాత్రం కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమాలతో ఎక్కువగా ఆకట్టుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు.
ఎన్నో వైవిధ్యమైన లఘు చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ దర్శకుడు మొదట అ! అనే సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. యువ హీరో నాని నిర్మించిన ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. విభిన్నమైన స్క్రీన్ ప్లేతో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ దర్శకుడిగా ప్రశాంత్ వర్మకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
ఆ తరువాత సీనియర్ యాంగ్రీ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా పరవాలేదనిపించింది. ఇక జాంబీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జాంబీ సినిమాతో కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. కానీ ప్రశాంత్ వర్మ అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది మాత్రం అ! సినిమానే.
ఇక చాలా మంది అ! సినిమాకు సీక్వల్ వస్తే కూడా బాగుంటుంది అని కోరుకున్నారు. అయితే దర్శకుడు ఇదివరకే సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయినట్లు తెలియజేశాడు. అంతే కాకుండా తమిళ నటుడు విజయ్ సేతుపతిని కూడా ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అడిగినట్లు చెప్పాడు.

ప్రస్తుతం అ! సీక్వెల్ ప్రాజెక్టు చర్చల దశలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ పూర్తిగా హనుమాన్ అనే ఒక పాన్ ఇండియా సినిమా తో రెడీ అవుతున్నాడు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ యాక్షన్ అడ్వెంచర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ దర్శకుడు మరో విభిన్నమైన సినిమా కథను కూడా రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా కూడా అ! తరహా స్క్రీన్ ప్లే తో ఉంటుందట. ఒక పాత్ర నుంచి మరో పాత్రకు కనెక్ట్ చేసి వెండితెరపై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ట్రీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ కోసం ఒకేసారి పది మంది హీరోయిన్లను సంప్రదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ ఈ దర్శకుడి కథ గురించి విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
తప్పకుండా ప్రశాంత్ వర్మ ఆ సినిమాతో ఒక డిఫరెంట్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకేసారి 10 మంది హీరోయిన్స్ తో సినిమా ఉంటే ఆ సినిమాకు ఈజీ గా హైప్ క్రియేట్ అవుతుంది. ఇక దర్శకుడు హనుమాన్ సినిమా తర్వాత ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ దర్శకుడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











