శంకర్ మాస్టర్ ప్లాన్.. ఓవైపు చరణ్, మరోవైపు కమల్ హాసన్.. ఒకేసారి అలా.. పండుగలే టార్గెట్
కోలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలు, టేకింగ్, అందులోని పాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన మంచి అనుభూతిని కలిగిస్తారు ఈ డైరెక్టర్. సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అలాగే అందులోని మెసేజ్ కూడా ఎంతో ఆలోచించేలా ఉంటాయి. అలా ఆయన భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి మెసేజ్ ఒరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ తెరకెక్కించి హిట్ కొట్టారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15, లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ కి సంబంధించి శంకర్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు టాక్.

శరవేగంగా షూటింగ్..
RRR వంటి సక్సెస్, ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న లేటేస్ట్ మూవీ RC15. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది. న్యూజిలాండ్ లో 10 రోజుల పాటు ఓ సాంగ్ షూట్ చేశారు.

చరణ్ కు పాటల కోసం..
న్యూజిలాండ్ లో చిత్రీకరించిన ఒక్కపాట కోసం రూ. 8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపించగా.. మరో పాట కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వచ్చింది. ఈ పాటలో రామ్ చరణ్ 80 సెకన్ల పాటు డ్యాన్స్ చేసి శంకర్ తో సహా మిగతా యూనిట్ ను ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ పాతబస్తీ, రాజమండ్రి, వైజాగ్ లలో కూడా ఒక సాంగ్ షూట్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో రామ్ చరణ్ సోలో సాంగ్ కు సంబంధించిన షూటింగ్ చేశారు.

ఇండియన్ 2పై ఫోకస్..
అలాగే కొండారెడ్డి బురుజు వద్ద తండ్రి పాత్రలో రామ్ చరణ్ చేస్తున్న పాటను చిత్రీకరించగా.. వైజాగ్ గీతం యూనివర్సిటీలో చెర్రీ కలెక్టర్ పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశారు. దిల్ రాజు, శిరీష్ రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న RC15 సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెలలో పూర్తి అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే ఇండియన్ 2పై ఫోకస్ పెట్టనున్నారట డైరెక్టర్ శంకర్.

చెర్రీ సినిమా తర్వాతే..
దక్షిణాదిలో అగ్ర దర్శకుడిగా పేరు పొందిన శంకర్ ఒకేసారి రెండు చిత్రాలు చేయడం ఇదే తొలిసారి. ఒకటి రామ్ చరణ్ తో RC15 కాగా మరొకటి యూనివర్సల్ హీరో ఇండియన్ 2. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రానుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. చెర్రీ మూవీ తర్వాత భారతీయుడు 2 చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నారట. ఇక ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పోస్డ్ ప్రొడక్షన్ పనులను ఒకేసారి నిర్వహించనున్నారని టాక్.

రెండు పండుగలకు ఫిక్స్..
ఇదిలా ఉంటే తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన విడుదల తేదిపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ ప్రకటన రాకపోయినా.. ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్, కమల్ హాసన్ సినిమాలను రెండు పండుగల సందర్భంగా విడుదల చేయాలని శంకర్ భావిస్తున్నారట. అందుకోసం దీపావళి, సంక్రాంతిని ఖరారు చేసినట్లు టాక్. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయనున్నారట.

దీపావళికి లేని విడుదల..
ఇక రామ్ చరణ్, కియరా అద్వానీ, అంజలి నటిస్తున్న RC15 మూవీని వచ్చే ఏడాది అంటే 2024 సంక్రాంతి బరిలో ఉంచనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కియారా పెళ్లి కారణంగా కొద్దిరోజుల షూటింగ్ వాయిదా పడగా.. త్వరలోనే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. కాగా కొన్నేళ్లుగా తమిళంలో దీపావళికి భారీ చిత్రాలు విడుదల చేయడం మానేశారు. ఇప్పుడు ఇండియన్ 2తో అది కొనసాగించనున్నారు.


Click it and Unblock the Notifications











