డిస్కో రాజా: హీరో రవితేజ, నిర్మాత మధ్య విబేధాలు...షూటింగ్ ఆగిపోయిందా?
Recommended Video
మాస్ మహారాజ్ రవితేజకు ఈ మధ్య అస్సలు కలిసిరావడం లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. చివరగా 2017లో 'రాజాది గ్రేట్' సినిమా ద్వారా సక్సెస్ చూసిన ఈ మాస్ హీరో... 2018లో చేసిన 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.
తాజాగా రవితేజ 'డిస్కో రాజా' అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మేజర్ షెడ్యూల్ మే మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా అలాంటి ఏర్పాట్లేవీ మొదలు కాలేదట. షూటింగ్ ఆగిపోవడం వెనక రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

రవితేజ, నిర్మాత మధ్య విబేధాలు?
‘డిస్కో రాజా' సినిమాకు సంబంధించి రవితేజ, చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేయాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్ తగ్గించాలనే ఆలోచన కూడా?
‘డిస్కో రాజా' చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలు పెట్టారట. నిర్మాత తాజాగా బడ్జెట్ రూ. 30 కోట్లకు కుదించడంలో భాగంగా కొన్ని పాటలు, విఎఫ్ఎక్స్ తీసేయాలని అనుకుంటున్నారట. మరికొన్ని సీన్ల విషయంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నాడట. ఈ విషయంలోనే రవితేజకు, నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం.

తాత్కాలికంగా ఆపివేశారా?
సినిమాకు సంబంధించి మార్పుల విషయంలో రవితేజ, రామ్ తాళ్లూరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకే తాత్కాలికంగా షూటింగ్ నిలిపివేశారట. మరి ఈ పుకార్లలో నిజం ఎంత అనేది చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ ప్రకటన వస్తేగానీ చెప్పలేం.

డిస్కోరాజా
విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న 'డిస్కోరాజా' మహా శివరాత్రి సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. గతంలో రవితేజతో ‘నేల టిక్కెట్' మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











