రంగంలోకి మరో స్టార్ హీరోయిన్.. తగ్గేదేలే అంటున్న డైరెక్టర్ సుకుమార్
అల వైకుంఠ పురం లో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఒక రకంగా తెలుగులో ఐటెం సాంగ్స్ కి క్రేజ్ తెచ్చిన దర్శకుడిగా సుకుమార్ కి పేరుంది. ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం అనే సాంగ్ తో ఐటెం సాంగ్స్ పరంపరకు సుకుమార్ కొత్త అర్థం చెప్పారు అనే చెప్పాలి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 సినిమాలో కూడా రింగ రింగా అనే సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే వీరి కాంబినేషన్ వస్తున్న మూడో సినిమా లో కూడా ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

బాలీవుడ్ బ్యూటీల కోసం
ఈ సినిమాలో ఐటెం సాంగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన సుకుమార్ తన గత సినిమాల్లో లేని విధంగా ఈ ఐటమ్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ తో అల్లు అర్జున్ తో కాలు కలిపేందుకు గానూ ఒక స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించాలని ముందు నుంచి భావిస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీలను రంగంలోకి దింపడానికి చూస్తున్నారని అంటున్నారు.

నిర్మాత క్లారిటీ
బాలీవుడ్ బ్యూటీలు దిశా పటాని, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ లాంటి వారిని ఇప్పటికే సంప్రదించారని అంటున్నారు. అయితే వారి డేట్స్ ఖాళీ లేని కారణంగా ఆ సాంగ్ మరొకరితో చేయించాలని భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఊర్వశి రౌతేలా పేరు తెర మీదకు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రెండో భాగంలోనే ఐటెం నెంబర్
ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కావడం ఖాయం అని తేల్చేసిన ఆయన రెండో భాగంలో ఒక మంచి ఐటెం నెంబర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఐటెం నెంబర్ కోసం దీక్ష పటాని లేదా పూజా హెగ్డే కోసం చూస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సుకుమార్ మార్క్ ఎక్కడా మిస్ కాకుండా ఈ ఐటెం సాంగ్ రూపొందించనున్నారని తెలుస్తోంది.
Recommended Video

భారీ అంచనాలు
ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ రష్మిక మందన నటిస్తూ ఉండగా ఫహాద్ ఫాజిల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











