‘డర్టీ’ బాటలో దివ్యభారతి జీవితంపై సినిమా?
నటి దివ్య భారతి జీవితంపై సినిమా తీయబోతున్నాను అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు 'నాట్ ఎ సూసైడ్" అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు వర్మ మళ్లీ ఆ సినిమా జోలి తీయలేదు. పబ్లిసిటీ కోసం వర్మ ఇలాంటి ప్రకటనలు వంద చేయడం, అందులో ఒకటో రెండో ఆచరణకు నోచుకోవడం మన తరచూ చూస్తూనే ఉన్నాం. వర్మ దివ్య భారతిపై సినిమా మొదలు పెడతాడో? లేదో కానీ.....వేరొకరు మాత్రం మొదలు పెట్టడానికి సిద్ధం ఉన్నారట.
అందుకు కారణం ఇటీవల విడుదలైన 'ద డర్టీ పిక్చర్" సినిమాయే. సిల్క్‌స్మిత జీవిత కథ స్ఫూర్తితో విద్యాబాలన్ హీరోయిన్ గా రూపొందిన 'డర్టీపిక్చర్" ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. దీంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం ప్రస్తుతం బాలీవుడ్‌లో ఊపందుకుంది. ఈ కోవలోనే నటి దివ్యభారతి జీవితం వెండితెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. ఒక దశలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హాట్ ఫేవరేట్‌గా నిలిచిన దివ్యభారతి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.ఈ మిస్టరీని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాత సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సంబంధించిన పూర్తి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











