టాలీవుడ్ స్టార్ హీరోకి విలన్‌గా ఫహద్ ఫాజిల్.. పుష్పను మించి రికార్డ్ రెమ్యునరేషన్? ఎన్ని కోట్లంటే?
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్. నటన రాదు అన్న వాళ్ల చేతే అద్భుతమైన నటుడు అనిపించుకున్నారు ఫహద్. హీరోగానే చేయాలన్న రూల్స్ పెట్టుకోకుండా మనసుకు నచ్చితే సహాయక పాత్రయినా చేయడానికి సిద్ధమని నిరూపించుకున్నారు. పుష్ప సిరీస్‌లో ఎస్పీ బైరాన్ సింగ్ షెకావత్‌గా అద్భుతంగా నటించారు. ఈ పాత్రలో ఆయన తప్పించి మరొకరిని ఊహించుకోలేమంటే ఫహద్ నటనను అర్ధం చేసుకోవచ్చు. పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో బ్లాక్‌బస్టర్ కావడం వెనుక ఫహద్ ఫాజిల్‌ది కూడా కీలకపాత్రే. పుష్ప తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకోనున్నట్లుగా ఫిలింనగర్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో రికార్డులు సృష్టించాడు అనిల్ రావిపూడి. ట్రిపుల్ హ్యాట్రిక్స్‌తో పాటు ఓటమి అనేది లేకుండా వరుసగా 9 విజయాలు అందుకుని చరిత్ర సృష్టించారు అనిల్. ప్రతి సంక్రాంతికి రావడం పండక్కి హిట్ కొట్టేసి వెళ్లిపోవడం అలవాటుగా చేసుకున్నారు. ప్రేక్షకుల నాడిని పట్టడం, అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా హీరోని ప్రెజెంట్ చేయడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపించి మెగాస్టార్ అభిమానులకు విందు భోజనం అందించాడు అనిల్. దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లతో మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది.

చిరంజీవితో మూవీ తర్వాత తాను మరోసారి సంక్రాంతికి వస్తున్నట్లు హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. అయితే అది ఎవరితో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. టాలీవుడ్‌ను నాలుగు దశాబ్ధాలుగా మూలస్తంభాలుగా మోస్తున్న నలుగురు అగ్రహీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో అనిల్ సినిమాలు చేసేశారు. ఇక మిగిలింది కింగ్ అక్కినేని నాగార్జున మాత్రమే. ఆయనతో కూడా సినిమా చేసి మెమొరబుల్ హిట్ అందించాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ ఊహాగానాలకు చెక్‌పెడుతూ తన తదుపరి సినిమాను విక్టరీ వెంకటేష్‌తో చేస్తున్నట్లు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనులలో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పటికే వెంకీ - అనిల్ కాంబినేషన్‌లో మూడు సినిమాలు (ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం) సినిమాలు వచ్చాయి. ఈ సంక్రాంత్రికి మన శంకర వరప్రసాద్‌లోనూ వెంకటేష్ భాగమయ్యారు. తాజాగా ఇప్పుడు మరోసారి వెంకటేష్‌ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలోనూ ఓ స్టార్ హీరో భాగం కానున్నారని వార్తలు వచ్చాయి. తొలుత తమిళ నటుడు కార్తీ ఈ సినిమాలో నటిస్తారని గాసిప్స్ వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో షెకావత్ సార్ మరో హీరోగా నటిస్తారా? లేక వెంకీకి విలన్‌గా నటిస్తారా? అనేది మాత్రం తెలియరాలేదు. అయితే వెంకీ - ఫహద్ మధ్య సీన్స్ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటాయని ఫిలిం నగర్‌లో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ఫహద్ రెమ్యునరేషన్‌కు సంబంధించి మరో గాసిప్ వైరల్ అవుతోంది. వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నందుకు షెకావత్ సార్ 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సినీ జనాలు అంటున్నారు.
అదే నిజమైతే పుష్ప సిరీస్‌కు మించి ఫహద్‌కు పారితోషికం ఇస్తున్నట్లు లెక్క. గతంలో పుష్ప ది రైజ్‌కు 3.5 కోట్ల రూపాయలు, పుష్ప 2 ది రూల్‌కు 7.8 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ కింద తీసుకున్నారు. ఈ రెండు పార్ట్స్‌కి కలిపి మొత్తంగా 12 కోట్ల రూపాయలకు మించలేదు. షెకావత్ సార్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఫహాద్‌కు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనుకాడటం లేదు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











