బాలయ్య నిర్మాతకు నాగార్జున ‘భాయ్’ షాక్?
అక్కినేని నాగార్జున, పూలరంగడు దర్శకుడు వీరభద్రం చౌదరి కాంబినేషన్లో 'భాయ్' అనే చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా నేపథ్యంలోతెరకెక్కనున్న ఈ సినిమాకి ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించినప్పటికీ..తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ భాధ్యతలు జెమినీ కిరణ్ చేతుల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఎంఎల్ కుమార్ చౌదరి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్లనే ఇది జెమినీ కిరణ్ చేతుల్లోకి వెళ్లిందని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. కుమార్ చౌదరి ఇప్పటికే బాలయ్య హీరోగా 'అధినాయకుడు' చిత్రాన్ని నిర్మించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున అతన్ని పక్కకు తప్పించి జెమినీ కిరణ్‌కి లైన్‌లోకి తెచ్చినట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి ప్రారంభం కానుందనీ ... స్క్రిప్ట్ సిద్ధంగా వుందని దర్శకుడు వీరభద్రం చెప్పారు. 'అహ నా పెళ్లంట' ... 'పూలరంగడు' వంటి విజయాలతో మాంఛి జోష్ మీదున్న వీరభద్రం, 'భాయ్' చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున 'శిరిడీసాయి' షూటింగ్లో బిజీగా ఉన్నందువలన, 'భాయ్' సినిమాకి సంబంధించిన ప్లానింగ్ పక్కాగా ఉండేలా చూసుకునే సమయం దొరికిందని వీరభద్రం అంటున్నారు.
గతంలో నాగార్జున చేసిన 'డాన్' సినిమా కూడా మాఫియా నేపథ్యంలో తెరకెక్కినదే. ఇక రీసెంట్ గా వచ్చిన 'బిజినెస్ మేన్' ... ప్రస్తుతం తెరకెక్కుతోన్న వెంకటేష్ 'షాడో' కూడా మాఫియా నేపథ్యానికి సంబంధించినవే. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతో రానున్న 'భాయ్' కి ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకూ లభిస్తుందనేది ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది.


Click it and Unblock the Notifications











