రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య అదే గ్యాప్?.. చెర్రీ బర్త్‌డేతో బయటపడ్డ విభేదాలు
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలోని హీరోల మధ్య సఖ్యత లేదని గతంలో మాదిరిగా అందరూ ఐకమత్యంగా లేరని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. మెగా ట్యాగ్ లైన్ నుంచి బయటికి వచ్చి తనకంటూ సెపరేట్ ఐడెంటీటీ కావాలని ఆయన కోరుకుంటున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ పరిణామాలు , అల్లు అర్జున్ చర్యలు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా పరిస్ధితులు తయారయ్యాయి. గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పరిస్ధితులు పీక్స్‌కు చేరాయి.
నాటి ఎన్నికల్లో తన మేనమామ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున కాకుండా ఆయన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఈ పరిణామాలు మెగా ఫ్యాన్స్‌కి , కుటుంబానికి మింగుడు పడలేదు. నా అనుకున్న వాళ్ల కోసం ఎక్కడి వారికైనా వెళ్తానని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కాక పుట్టించాయి. ఎన్నికలు ముగిసిన తక్షణం నాగబాబు చేసిన ట్వీట్, పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ కనిపించకపోవడం వంటి ఘటనలు కలకలం రేపాయి.

అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా రెడ్డిలను సాయిథరమ్ తేజ్ సోషల్ మీడియాలో అన్ ఫాలో కావడం ఈ పరిణామాలన్నీ మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని సందేశాలు జనంలోకి బలంగా పంపాయి. తర్వాత పుష్ప 2 సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు.
బెయిల్‌పై బయటికొచ్చిన వెంటనే చిరు, నాగబాబుల ఇంటికి సతీసమేతంగా వెళ్లారు అల్లు అర్జున్. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు సమసిపోయినట్లేనని అంతా భావించారు. ఈ వివాదం సద్దుమణిగిన కొన్నాళ్లకు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాత దిల్‌రాజ్‌కు ఈ చిత్రం భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే సినిమా బాగున్నప్పటికీ ..నెగిటివ్ పబ్లిసిటీ కారణంగానే గేమ్ ఛేంజర్ పరాజయం పాలైందని మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు. ఆ సమయంలో మెగా - అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది.
అయితే పరిస్థితులు చక్కబడి ప్రస్తుతం ఎలాంటి వివాదం లేకుండా ఉన్న వేళ.. మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు తగ్గలేదని , వివాదం సద్దుమణగలేదంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి రామ్ చరణ్ పుట్టినరోజు వేదికైంది. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. అయితే సొంత బావ అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదు.
ప్రతి ఏడాది అల్లు అర్జున్ క్రమం తప్పకుండా చెర్రీ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పేవాడు. అలాగే చరణ్ బర్త్ డే పార్టీలోనూ ఖచ్చితంగా ఉండేవాడు. అలాంటిది ఈసారి కనీసం పోస్ట్ కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే మెగా - అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందా? కావాలనే అల్లు అర్జున్ చెర్రీకి విష్ చేయలేదా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది.


Click it and Unblock the Notifications











