మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీపై క్లారిటీ!
ఓ వైపు చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ 'సైరా నరసింహా రెడ్డి' సంచలనాలు సృష్టిస్తుంటే.. మరోవైపు మెగా అభిమానులు మరింత ఖుషీ అయ్యేలా మరో వార్త బయటకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిత్వరలో ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారనేది ఆ వార్త సారాంశం. అంటే తండ్రీకొడుకుల మల్టీస్టారర్ సినిమాకు ముహూర్తం కుదిరిందన్నమాట. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా..

మెగా అభిమానుల ఆశ
చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో సినిమా చేస్తే చూడాలనేది మెగా అభిమానుల ఆశ. అయితే అది త్వరలోనే తీరబోతోందని టాక్ వినిపిస్తోంది. తండ్రితో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రామ్ చరణ్ రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. అందుకోసమే రీసెంట్‌గా 'లూసిఫర్' రీమేక్ హక్కులను చెర్రీ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

ప్లాన్ చేసిన రామ్ చరణ్.. అందుకే
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన 'లూసిఫర్' సినిమా రీమేక్ హక్కులను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ లీడ్ రోల్ పోషించారు. పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ తీసుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని సమాచారం.

చిరుతో పాటు రామ్ చరణ్
తండ్రి చిరంజీవి కోసమే రామ్ చరణ్ ఈ రీమేక్ హక్కులను తీసుకున్నారని మెగా సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ఈ రీమేక్ సినిమాలో తండ్రితో పాటు రామ్ చరణ్ కూడా తెర పంచుకునేలా సన్నాహాలు ప్రారంభించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే మెగా అభిమానులకు ఇంతకన్నా మించిన కన్నుల పండుగ మరొకటి ఉండదేమో!.

ఇదీ అంతకన్నా ఆసక్తికర విషయం
మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమాను 'సైరా నరసింహారెడ్డి'కి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గతంలో మూడు సార్లు చిరుతో చెర్రీ
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర' సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘బ్రూస్‌లీ' సినిమాలో అతిథి పాత్రలో కాసేపు రామ్ చరణ్ పక్కన కనిపించారు మెగాస్టార్. ఇక చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్, చిరు కలిసి ''అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు'' పాటలో స్టెప్పులేశారు. కానీ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా ఫుల్ లెంగ్త్ రోల్ చేయలేదు.

ఎంతవరకు సాధ్యం.. ఒకవేళ జరిగితే
చిరంజీవి తన తదుపరి సినిమాను ఆల్రెడీ కొరటాల శివతో కన్ఫర్మ్ చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. సో ఒకవేళ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమా ఓకే అయినా అది రావడానికి చాలా సమయమే పట్టొచ్చు. అయినప్పటికీ తండ్రీకొడుకుల మల్టీస్టారర్ అనేసరికి మెగా అభిమానుల్లో జోష్ రెట్టింపయింది. చూద్దాం చివరకు ఏం జరుగుతుందో!.


Click it and Unblock the Notifications











