Divorce: విడాకుల దిశగా హన్సిక మోత్వానీ? ఒక్క పోస్ట్‌తో తేల్చేసిన స్టార్ హీరోయిన్
చిత్ర పరిశ్రమలో సెలబ్రెటీల విడాకుల వార్తలకు చెక్ పడటం లేదు. నిత్యం ఎవరో ఒక స్టార్ కపుల్ విడిపోతున్నట్లుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. గడిచిన ఏడాదిగా ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ జంట విడిపోతున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటికి వీరిద్దరూ చెక్ పెట్టారు. కొద్దిరోజుల క్రితం లేడీ సూపర్‌స్టార్ నయనతార- విఘ్నేష్ శివన్ జంట విడిపోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గుడిలో భర్త, పిల్లలతో కలిసి పూజ చేసి ఈ రూమర్స్‌కు తెరదించారు నయన్. తాజాగా మరో హీరోయిన్ తన భర్తతో విడిపోతున్నట్లుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
15 ఏళ్లకే హీరోయిన్‌గా ఎంట్రీ
కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దేశముదురు, కందిరీగ తదితర హిట్ సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేశారు హన్సిక మోత్వానీ. వైట్ స్కిన్ టోన్, మత్తెక్కించే చిరునవ్వుతో ఆమె కుర్రకారును షేక్ చేశారు. నితిన్, రామ్, గోపీచంద్, విశాల్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటించిన హన్సిక కెరీర్ ఓ దశలో సక్సెస్‌ఫుల్‌గా సాగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ముద్దుగా, బొద్దుగా ఉండే హన్సికను తమిళ తంబీలు బాగా ఆదరించారు. విజయవంతంగా సాగుతున్న హన్సిక కెరీర్‌కు వరుస ఫ్లాపులు బ్రేక్ వేశాయి.

వరుస ఫ్లాపులతో డౌన్‌ఫాల్
స్టార్ హీరోయిన్ రేసు నుంచి ఒక్కసారిగా ఆమె కిందపడిపోయారు. చేసిన ఏ చిత్రం కూడా హిట్ కాకపోవడంతో ఒకదశలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. చివరికి టెలివిజన్‌లో జడ్జిగా చేయాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. అయినప్పటికీ అవమానాలను తట్టుకుని నిలబడి తిరిగి సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు హన్సిక. ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ, మ్యాన్, గాంధారి సినిమాలతో పాటు హిందీలో లవ్ ఎఫైర్ చిత్రంలో హన్సిక నటిస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తమిళ నటుడు శింబుతో హన్సిక పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. శింబుతో రేపో మాపో పెళ్లి అనగా వీరిద్దరూ విడిపోయారు. వీరి మధ్య గ్యాప్ రావడానికి కారణాలు ఏంటనేది తెలియరాలేదు.
శింబుతో ప్రేమాయణం
శింబుతో బ్రేకప్ తర్వాత తన సినిమాలపై ఫోకస్ పెట్టారు హన్షిక. ఈ క్రమంలో సొహైల్ కతూరియాతో ప్రేమలో పడిన ఆమె కొన్నాళ్లు ఆయనతో డేటింగ్ చేసి 2022 డిసెంబర్ 22న వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. హనీమూన్‌తో పాటు తరచుగా వెకేషన్‌కి వెళ్తూ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు హన్సిక- సొహైల్. అయితే హన్సికతో పెళ్లయ్యే నాటికే సొహైల్‌కు వివాహం జరిగింది. ఒకానొక దశలో హన్సిక వల్లే సొహైల్ తన భార్యతో విడిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆమె ఖండించారు.. తన భర్త విడాకులకు తాను కారణం కాదని క్లారిటీ ఇచ్చారు.
భర్తకు దూరంగా హన్సిక
కాగా.. మూడేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన హన్సిక- సొహైల్ మధ్య ప్రస్తుతం మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. పెళ్లయిన కొత్తలో హన్సిక- సొహైల్‌లు కలిసే ఉండేవారు.. అయితే ఆ కుటుంబంలో హన్సిక ఇబ్బంది పడటంతో తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఆమె తన తల్లి వద్దకు వెళ్లిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో భర్తతో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేసేవారు హన్సిక. అయితే ప్రస్తుతం తల్లితో కలిసి వీడియోలు చేస్తూ తమ వైవాహిక బంధంలో గొడవలపై పరోక్షంగా హింట్ ఇస్తున్నారు ఈ స్టార్ హీరోయిన్. ఈ పరిస్థితుల నేపథ్యంలో హన్సిక - సొహైల్‌లు విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మరి వీరిద్దరూ నిజంగా విడాకులు తీసుకుంటున్నారా? లేక ప్రచారం మాత్రమేనా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











