Pushpa 2 The Rule : పుష్ప 2 నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు.. అల్లు అర్జున్ మూవీకి ట్యాక్స్ ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్ధ శత దినోత్సవం జరుపుకోవడంతో పాటు గతంలో ఉన్న పలు చిత్రాల రికార్డులను అల్లు అర్జున్ బద్ధలు కొట్టాడు. ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రెండ్రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన పుష్ప 2 ఇక్కడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
పుష్ప 2ని దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11 వేల థియేటర్‌లలో రిలీజై పుష్ప 2.. తొలి రోజే రూ. 294 కోట్ల రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి వారంలోనే రూ.1000 కోట్లు, రెండు వారాలు ముగిసేసరికి రూ. 1400 కోట్లు, 21 రోజుల్లో రూ.1700 కోట్లు, 60 రోజుల్లో రూ.1800 కోట్లు రాబట్టింది పుష్ప 2. ఇప్పటి వరకు రూ.850 కోట్లకు పైగా షేర్ అందుకున్న పుష్ప 2 .. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.230 కోట్లకుపైగా లాభాలను పంచి పెట్టింది.
ఇలాంటి దశలో కొద్దిరోజుల క్రితం పుష్ప 2 నిర్మాతలైన నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో టాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన కీలక వివరాలను అధికారులు వారి నుంచి అడిగి తెలుసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్‌కు గాను చిత్ర నిర్మాతలు ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించారా అన్న దానికి సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.

సీపీఎం నేత సీ. శోభన్ సమాచార హక్కు చట్టం కింద వాణిజ్య పన్నుల శాఖ నుంచి పుష్ప 2 ది రూల్‌కు సంబంధించిన ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీల వివరాలు.. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ , ఓవర్సీస్ హక్కులు, ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయన వివరాలను సేకరించినట్లుగా కొన్ని వెబ్‌సైట్స్ కథనాలను ప్రచురించాయి. దీని ప్రకారం నవంబర్ , డిసెంబర్ నెలలకు గాను రూ.642 కోట్ల టర్నోవర్‌కు గాను రూ.110 కోట్ల ట్యాక్స్ చెల్లించినట్లుగా ఉంది.
పుష్ప 2 సినిమాకు గాను నెలవారీ జీఎస్టీఆర్ -3బీ, జీఎస్టీఆర్ -01 రిటర్న్స్‌ను వాణిజ్య పన్నుల శాఖకు అందించినట్లుగా అధికారులు.. శోభన్‌కు సమాచారం అందించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇది జీఎస్టీ ట్యాక్స్ మాత్రమేనా? ఇందులో ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా కలిసే ఉందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











