అంచనాలు పెంచేస్తున్న సైరా.. ఆ ఒక్క సీన్ కోసం 45 కోట్లు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని మహా యజ్ఞంలా నిర్మిస్తున్నారు. రాంచరణ్ స్వయంగా ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు చూసుకుంటున్నాడు. దేశంలో అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అతిరథ మహారధులు లాంటి నటులంతా ఈ చిత్రంలో భాగస్వాములు అవుతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశం గురించి జరుగుతున్న ప్రచారం సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.

అందాల తారలంతా
ఈ చిత్రంలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమన్నా, ప్రగ్య జైస్వాల్ వంటి అందాల తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర తారాగణమే భారీస్థాయిలో ఉంది. అంతకు మించేలా చిత్రంలో కీలక సన్నివేశాల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బ్రిటిష్ కోటపై దండయాత్ర
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులో 35 రోజుల పాటు భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ కోటాపై సైరా నరసింహా రెడ్డి దండెత్తే పోరాట సన్నివేశం అది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య మెగాస్టార్ చిరంజీవి రేయింబవళ్లు కష్టపడ్డారు. దీన్ని తలదన్నేలా మరో పోరాట సన్నివేశం ఉండనుంది.

ఒక్క సీన్ కోసం 45 కోట్లు
సైరా చిత్ర యూనిట్ జార్జియాలో భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నారు. ఈ ఒక్క యుద్ధం ఖర్చు అక్షరాలా 45 కోట్లు. అంతా భారీస్థాయిలో ఈ పోరాట సన్నివేశం ఉండనుంది. ఆడియన్స్ థియేటర్స్ లో ఈ సన్నివేశం కోసం సీటు అంచుమీద కూర్చుని వీక్షించేలా ఉంటుందని సమాచారం.

హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్
ఈ చిత్రం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ పనిచేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సూచనలతో ఈ సన్నివేశాన్ని రోమాలు నిక్కబొడుచుకునేలా డిజైన్ చేశారని సమాచారం. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

వేసవి కానుకగా
ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని 2019 వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











