ఆర్ఆర్ఆర్‌లో రాంచరణ్ పేరు ఇదే.. 'R' అక్షరంతోనే మొదలు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజమౌళి కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించేశారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి వార్త అభిమానులని ఉత్కంఠకు గురిచేస్తోంది. రాజమౌళి గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ కు విశ్రాంతి కల్పించి రాంచరణ్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ పాత్రకు సంబందించిన విశేషాలు రివీల్ అవుతున్నాయి.

పోలీస్ స్టేషన్
ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేషన్ లో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ సెట్ లీక్ అయింది. పోలీస్ స్టేషన్ ముందు బ్రిటిష్ జెండా కూడా కనిపించింది. దీనితో రాంచరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలోని పోలీస్ అధికారిగా కనిపిస్తాడని తెలిసిపోయింది. ఇక ఈ చిత్రానికి రాజమౌళి టైటిల్ ఖరారు చేయలేదు. వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ ఆర్ తోనే ప్రస్తుతం పిలుస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రల పేర్లు ఆర్ అక్షరంతో పార్రంభం అవుతాయనే వార్తలు ఉన్నాయి.

రాంచరణ్ పేరు ఇదే
ఈ చిత్రం రాంచరణ్ పేరు గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాంచరణ్ పాత్రకు రాజమౌళి రామరాజు అనే పేరుని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ పాత్రలో అల్లూరి సీతారామరాజు లక్షణాలు ఉండేలా రాజమౌళి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ఒక ఆర్ ఏంటో తెలిసిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ఇక ఎన్టీఆర్ పాత్ర కూడా ఆర్ అక్షరంతోనే ప్రారంభం కానుంది. మిగిలి మూడవ ఆర్ ఎవరి పాత్ర అనేది సస్పెన్స్ అని కొందరు అంటున్నారు.

హరియాణా నేపథ్యంలో
ఈ చిత్రం హరియాణా నేపథ్యంలో సాగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ సెట్ పై ఆనంగ్ పూర్ పోలీస్ అవుట్ పోస్ట్ అని రాసి ఉంది. ఆనంగ్ పూర్ అనేది హరియాణా రాష్ట్రంలోని ఓ ప్రాంతం. ఇటీవలే వెయ్యిమంది ఈ పోలీస్ స్టేషన్ పై అటాక్ చేసే యాక్షన్ సన్నివేశాన్ని రాజమౌళి రాంచరణ్ పై చిత్రీకరించాడు. కళ్ళు చెదిరేలా ఈ యాక్షన్ సన్నివేశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అదే కీలకం
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో బందిపోటుగా నటిస్తున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్ ఎలా కలిశారనేదే ఈ చిత్రంలో కీలకం కానుంది. డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ సరసన నటించే హీరోయిన్లని రాజమౌళి ఎంపిక చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











