పాత కథనే కొత్తగా బన్నీతో.. త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ వదిలేలా లేడుగా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరదించాడు. నా పేరు సూర్య తర్వాత తదుపరి చిత్రం ప్రకటించడానికి బన్నీ చాలా టైం తీసుకున్నాడు. దానికి కారణం సరైన కథ కుదరకపోవడమే. అరవింద సమేత చిత్రం తర్వాత త్రివిక్రమ్ వినిపించిన కథ నచ్చడంతో బన్నీ ఒకే చేశాడు. కొత్త సంవత్సరం సందర్భంగా నిన్ననే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. ప్రకటన జరిగిందో లేదో కానీ అప్పుడే కథ గురించి వార్తలు బయటకు వస్తున్నాయి.

మళ్లీ అదే సెంటిమెంట్
ముందుగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం అని త్రివిక్రమ్ సొంత కథతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే త్రివిక్రమ్ ఎప్పుడూ ఉపయోగించే ఫార్ములానే ఈ చిత్రానికి కూడా ఉపయోగించబోతున్నాడట. తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో బన్నీ కోసం కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

కొంచెం కొత్తగా
తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో త్రివిక్రమ్ ఇప్పటికే చాలా చిత్రాలు చేశారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం కూడా ఆ కోవకు చెందిందే. సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయం సాధించింది. ఇటీవల గత ఏడాది వచ్చిన అరవింద సమేత చిత్రంలో కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఈ సారి ఫాదర్ సెంటిమెంట్ కథనే కొత్త కోణంలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త కోణం ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

సొంత బ్యానర్‌లోనే
అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. మరోవైపు హారిక అండ్ హాసిని సంస్థ రాధాకృష్ణ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కానున్నారు. ఈ నిర్మాతతో త్రివిక్రమ్ వరుసగా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ సెట్ కావడంతో బన్నీ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

హ్యాట్రిక్ మూవీ
నాపేరు సూర్య చిత్రం నిరాశ పరచడంతో తదుపరి చిత్రంతో ఎలాగైనా విజయం సాధించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ చిత్రంలో నటీనటులు, హీరోయిన్, సంగీత దర్శకుడు తదుపరి వివరాలన్నీ త్వరలో ప్రకటించనున్నారు. జనవరిలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











