ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాకు భీకరమైన టైటిల్.. రాజమౌళి మల్టీస్టారర్ రేపే లాంచ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రంగం సిద్ధం అయింది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించబోతున్న ఈ సినిమా కోసం యావత్ దేవం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా హాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీ ఇవ్వగలదని నిరూపించాడు. అంతకు రెట్టించి బడ్జెట్ తో రూపొందబోతున్న ఆర్ఆర్ఆర్ తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. నవంబర్ 11 అంటే రేపే ఈ చిత్రం వైభవంగా ప్రారంభం కాబోతోంది.

ప్రభాస్ ముఖ్య అతిథిగా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. రాంచరణ్, ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయనునట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. బాహుబలి చిత్రంలో భాగమైన చాలామంది ఈవేడుకకు అతిథులుగా హాజరవుతారట.

రచ్చ మొదలయింది
ఇద్దరు క్రేజీ హీరోలు కలసి నటిస్తున్న చిత్రం, అందులోను జక్కన్న దర్శత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి ప్రారంభమైంది. నెటిజన్లంతా చిత్రం ఎలా ఉండబోతోంది, టైటిల్ ఏంటి, ఏ నేపథ్యంలో కథ ఉండబోతోంది అనే చర్చలో తలమునకలై ఉన్నారు.

భీకరమైన టైటిల్
ఈ చిత్రానికి ప్రాధమికంగా ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. రాజమౌళి, రామారావు, రాంచరణ్ అని దీని అర్థం. ఆర్ఆర్ఆర్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే కాదని.. అందులోనే భీకరమైన టైటిల్ దాగుందని అటు సినీవర్గాల్లో, అభిమానుల్లో చర్చ జరుగుతోంది. 'రామ రావణ రాజ్యం' అనేది ఈ చిత్ర టైటిల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది.

కళ్ళు చెదిరే బడ్జెట్
ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందించేందుకు సిద్ధం అవుతున్నారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఎప్పటిలాగే రాజమౌళి చిత్రానికి కీరవాణి స్వరాలు అందించనున్నారు. సినిమా గురించి మరిన్ని విశేషాలు ప్రారంభోత్సవం సందర్భంగా తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











