గుర్రమెక్కనున్న గురుడు.. విక్టరీ వెంకటేష్ పక్కా ప్లాన్! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
తరం మారినా సీనియర్ హీరోల హంగామా మాత్రం ఆగడం లేదు. నిన్నటితరం టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వరుస సినిమాలు చేస్తూ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. వయసు పైబడినప్పటికీ యంగ్ లుక్ లోకి వచ్చి యువ హీరోలను మరిపించేలా నటనా ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విక్టరీ వెంకటేష్ గుర్రపు స్వారీతో కనువిందు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
F2 సక్సెస్‌తో మంచి జోష్ లో ఉన్న వెంకటేష్.. ప్రస్తుతం 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా పూర్తి కాగానే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమా చేయబోతున్నారని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట తరుణ్ భాస్కర్. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెరకెక్కనుందని, పక్కా లోకల్ కంటెంట్ ఉండనుందని తెలిసింది.
ఈ చిత్రంలో గుర్రమెక్కి గురుడు వెంకటేష్ పరుగులు పెడతారట. హైదరాబాద్ మలక్‌పేటలోని రేస్ క్లబ్‌లో మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తారని టాక్ నడుస్తోంది. దగ్గుబాటి వారి సొంత బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందించనుందట. అతిత్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారట.


Click it and Unblock the Notifications











