విజయ్, మహేశ్, మమ్ముట్టి, షారుక్‌తో పాన్ ఇండియా మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇటీవలికాలంలో బడా ప్రాజెక్ట్‌లు లాంచ్ అవుతున్నాయి. కలలో కూడా అసాధ్యమనుకునే కాంబినేషన్‌లను దర్శక నిర్మాతలు సెట్ చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొడుతున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా ఈ నయా ట్రెండ్ కనిపిస్తోంది. పాన్ ఇండియా మేనియాతో చిత్ర పరిశ్రమలో ఏదైనా సాధ్యమే అనే సెంటిమెంట్ నానాటికీ బలపడుతోంది. దీనికి తగినట్లుగానే మేకర్స్ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఫక్తు కమర్షియల్ ఫార్ములాలను పక్కనబెట్టి.. ప్రయోగాలకు సైతం పెద్దపీట వేస్తున్నారు మన హీరోలు . సినీరంగానికి ఈ మార్పు సానుకూల పరిణామమే.
ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఓ మల్టీస్టారర్ తీసే యోచనలో వున్నారు. డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలతో తమిళనాట తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జైలర్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ పాన్ ఇండియా ఫార్ములా , మార్కెటింగ్ స్ట్రాటజీలను నెల్సన్ బాగా ఒంటబట్టించుకున్నట్లే కనిపిస్తోంది.

జైలర్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్‌లు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ స్టార్‌లను తీసుకుంటే తెలుగువాళ్లు ఫీలవతారేమోనని భావించి మన బాలయ్యతోనూ ఓ రోల్ చేయించాలని అనుకున్నాడు నెల్సన్. అయితే కథలో నటసింహానికి తగ్గ పవర్‌ఫుల్ రోల్ దొరక్కపోవడంతో ఆయనకు జైలర్‌లో ఛాన్స్ మిస్ అయ్యింది.
జైలర్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో మరోసారి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట నెల్సన్. ఇళయదళపతి విజయ్‌తో మరోసారి జతకట్టాలని చూస్తోన్న నెల్సన్ .. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబును కూడా నటింపజేయాలని చూస్తున్నారట. అక్కడితో ఆగితే కిక్కేముంది అనుకున్నాడో ఏమో కానీ.. పనిలో పనిగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఈ సినిమా కోసం తీసుకొస్తానని చెబుతున్నారు. నెల్సన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే విజయ్ 69వ చిత్రం మైల్‌స్టోన్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.

కానీ ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం మహేశ్ ప్రిపేర్ అవుతున్నారు. తన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు తన క్యాస్టింగ్‌ను మరో సినిమాలో నటించడానికి జక్కన్క ఒప్పుకుంటారా .. కాకపోతే గెస్ట్ రోల్ కాబట్టి ఆలోచించవచ్చు. అయితే ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్‌లకు మళ్లీ ఊపుతీసుకొచ్చింది ఖచ్చితంగా మహేశ్ బాబే . గతంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించారు ప్రిన్స్. ఆ సినిమాను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని చాలా మల్టీస్టారర్‌లు తెరకెక్కాయి.
విజయ్ - నెల్సన్‌లు గట్టిగా ట్రై చేస్తే మహేశ్ ఒప్పుకోకపోవడమంటూ వుండదని విశ్లేషకులు అంటున్నారు. మమ్ముట్టి విషయానికి వస్తే.. వయసు, అనుభవం, స్టార్‌డమ్ రీత్యా ఆయన ఇటీవలికాలంలో కథాబలం వున్న సినిమాలనే చేస్తున్నారు. విజయ్ వంటి స్టార్ నటిస్తూ వుండటంతో మమ్ముట్టి కూడా ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదు.
ఇక చివరిగా బాలీవుడ్ బాద్ షా విషయానికి వస్తే.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై రారాజులాంటి ఈయన కెరీర్‌లో దక్షిణాదిలోని ఏ మూవీలోనూ ఇంత వరకు గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్‌పై దండయాత్ర చేయడంతో షారుఖ్‌కు దక్షిణాది సత్తా అర్ధమైంది.
సౌత్ మూవీస్ ముందు హిందీ పరిశ్రమ నిలబడలేకపోవడాన్ని ఆయన కళ్లారా చూశారు. మన సత్తాను గ్రహించిన ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి జవాన్‌ను తెరకెక్కించారు. నయనతారా, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి దక్షిణాది నటులే ఇందులో కీ రోల్ ప్లే చేశారు. సౌత్‌లో మరింత పాపులారిటీ సంపాదించాలని భావిస్తే.. షారుఖ్ కూడా నెల్సన్ మూవీకి ఓకే చెప్పొచ్చు. మొత్తం మీద నెల్సన్ అనుకున్న మల్టీస్టారర్ కార్యరూపం దాల్చడం పెద్ద విషయమేమీ కాదు.


Click it and Unblock the Notifications











