ఎన్టీఆర్‌తో కేజీఎఫ్ డైరెక్టర్ మూవీ.. మహేష్‌తో వర్కవుట్ కాలేదు కానీ..
అరవింద సమేత లాంటి భారీ విజయాన్ని చేజిక్కించుకొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాల ఎంపిక కూడా అదే రేంజ్‌లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా ఎస్ఎస్ రాజమౌళితో RRR సినిమాలో నటిస్తున్న తారక్.. మరో సెన్సేషనల్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. కేజీఎఫ్ లాంటి క్రేజీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య భేటీ జరిగిందని, ఆ సందర్భంగా చెప్పిన కథ తారక్‌కు విపరీతంగా నచ్చినట్టు తెలిసింది. దాంతో ప్రశాంత్ నీల్‌తో పనిచేయడానికి సంసిద్ధమైనట్టు సమాచారం. కేజీఎఫ్ చిత్రాన్ని తీసిన తీరు, కథను నడపించిన విధానం ఆకట్టుకోవడంతో ప్రశాంత్ నీల్‌తో ముందుకెళ్లాలని భావిస్తున్నాడట. అంతేకాకుండా కన్నడ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆయన తెలుగు భాషపై దృష్టిపెట్టినట్టు కూడా తెలుస్తున్నది.

ఎస్ఎస్ రాజమౌళితో RRR సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్‌తో మూవీ పట్టాలెక్కుతుందని సమాచారం. యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో కూడిన కథను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఆరంభంలో కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేజీఎఫ్ హిట్ తర్వాత.. ప్రిన్స్ మహేష్ బాబుకు ప్రశాంత్ నీల్ కథ చెప్పినట్టు తెలిసింది. అయితే కథ నచ్చకపోవడంతో వారి కాంబినేషన్ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదనేది తాజా సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రం 2020 ఏడాది ఆరంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











