కాజల్ కూడా తప్పుకుందా.. ‘ఆచార్య’కు తప్పని కష్టాలు
మెగాస్టార్ చిరంజివి కొరటాల శివ కాంబినేషన్‌లో చిత్రాన్ని ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ అనుకున్నట్టుగా ఏదీ జరగడం లేదు. సినిమాను ఎంత త్వరగా విడుదల చేద్దామని ప్రయత్నిస్తే.. అంత ఆలస్యమవుతోంది. టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంలో ఆలస్యం కావడంతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో అభిమానులు హల్చల్ చేశారు. తీరా చిరు నోరు జారడంతో టైటిల్ కాస్త ముందే లీకైపోయింది.
ఆచార్య అంటూ చిరంజీవి లీక్ చేయడంతో ఆ ఈవెంట్ కూడా తుస్సుమంది. ఇక చిరు పక్కన హీరోయిన్ విషయంలో ముందు నుంచీ ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. త్రిష కంటే ముందు ఎంతో మందిని పరశీలించినా ఏ ఒక్కరూ వర్కౌట్ కాలేదు. అయితే చివరకు త్రిష కూడా తప్పుకోవడంతో చిత్రయూనిట్ చిక్కుల్లో పడింది.

త్రిష స్థానంలో చాలా మంది సీనియర్ భామల పేర్లు వినిపించాయి. చివరకు చందమామ కాజల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కాజల్ కూడా హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల తాను ఆచార్యకు ఇచ్చిన డేట్స్ వృథా అయిపోయాయని, మళ్లీ అడ్జస్ట్ చేయలేనని చెప్పిందంటా. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











