హరిహర వీరమల్లులో స్పెషల్ సాంగ్.. పవన్ కల్యాణ్‌తో స్టెప్పులకు కుర్ర హీరోయిన్ రెడీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనేది టాలీవుడ్ లో రాణించాలనుకునే హీరోయిన్ల డ్రీమ్ అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టడంతో పవన్ కున్న క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనతో రాఖీ భాయ్ హీరోయిన్ రొమాన్స్ చేయబోతుందనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఇంతకీ ఈ హీరోయిన్ ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయబోతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో కింగ్ మేకర్ గా మారిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ పూర్తయ్యాక తిరిగి సినిమాలోకి కాలు పెడతాడని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం తన విలువైన సమయాన్ని ప్రజల కోసమే కేటాయిస్తున్నారు.

రీసెంట్ గా ఆయన సినిమాలకు టైం ఇవ్వడానికి మరో మూడు నెలలు పడుతుందని, ఆ మూడు నెలల తర్వాత కూడా రెండు లేదా మూడు రోజులు మాత్రమే షూటింగ్ కి కేటాయిస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో నిరాశకు గురైన మెగా ఫాన్స్ సైలెంట్ అయిపోయారు. దర్శకుల పరిస్థితి ఏమో గాని అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ సెట్స్ లో తిరిగి ఎప్పుడెప్పుడు కాలు పెడతాడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి, క్రిష్ దర్శకత్వంలో సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది.

అయితే పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ మొదలుపెడితే ముందుగా పూర్తి చేసేది ఓజీనే. ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆలోచిస్తారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఆగస్టులో రీస్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20-25 రోజులు కేటాయిస్తే చాలని, ఆయన లేకుండా మిగతా పార్ట్ లను పూర్తి చేయవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగాన్ని చిత్రీకరించగా, మిగిలిన సన్నివేశాలను మూవీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం తనయుడు, డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న కన్నడ భామ శ్రీనిధి శెట్టి కూడా ఈ సినిమాలో భాగం కాబోతోందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. కేజీఎఫ్ తర్వాత ఈ బ్యూటీకి సరైన ఛాన్స్ రాలేదు. దీంతో శ్రీనిధి హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ తో స్పెషల్ సాంగ్ లో మెరువబోతోందని అంటున్నారు. ఈ పుకార్లు గనక నిజమైతే శ్రీనిధి ఫేట్ తప్పకుండా మారుతుందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











