సాక్ష్యంగా మహేష్ ని సైతం లాగుతున్నారు
హైదరాబాద్: సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండటానికి మహేష్ బాబు ప్రయత్నిస్తూంటారు. రీసెంట్ గా తన ఆగడు సెట్ లో జరిగిన ప్రకాష్ రాజ్ వివాదంపైన కూడా ఆయన పెదవి విప్పలేదు. అయితే అసలు ఆగడు సెట్స్ పై ఏం జరిగింది అనే విషయంలో నిజ నిర్దారణ చేయాలని నిర్మాతల మండలి భావించి,ఎంక్వైరీ చేస్తోందని సమాచారం. ఈ మేరకు మహేష్ బాబుని సాక్ష్యం గా తీసుకునే అవకాసం ఉందంటున్నారు. ఎందుకంటే సెట్ లో ఆ సమయంలో ఖచ్చితంగా ఉండే వారి సాక్ష్యాదారాలు అన్నిటినీ పరిశీలించి,ప్రకాష్ రాజ్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. మరి మహేష్ ఏ విధంగా ఈ వివాదంలో సమాధానం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
వివాద వివరాల్లోకి వెళితే... 'ఆగడు' సినిమా సెట్‌లో తనపై ప్రకాష్‌రాజ్ దురుసుగా ప్రవర్తించారనీ, అకారణంగా దుర్భాషలాడారనీ ఒక సహాయ దర్శకుడు ఇటీవల తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. దీంతో దర్శకుల సంఘం అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో ప్రకాష్‌రాజ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ఇప్పుడు ఆయనకే సమస్యగా మారింది. ఆ సమావేశంలో ''జరిగిన సంఘటనను వక్రీకరించి నాపై ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఆడుతున్న నాటకమే ఇదంతా. ఆ వ్యక్తి ఎవరన్నది త్వరలో చెబుతా. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు'' అన్నారు ప్రకాష్‌రాజ్.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ''ఆగడు' సినిమా కోసం నేను మొదటి రోజు సెట్‌లో చేయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తి చేశాను. నాకూ, దర్శకుడికీ మధ్య సృజనాత్మకతకి సంబంధించిన భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో నన్ను కాదనుకొని వేరొక నటుడిని తీసుకొన్నారు. వేరే నటుడిని ఎంచుకొనే హక్కు వారికి ఉంటుంది. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా, ఆ సంఘటనను వక్రీకరించి నాపై దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధాకరమైన విషయమేమిటంటే... ఆవేశంతో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును అందుకొని దర్శకుల సంఘం నాపై చర్య తీసుకోవాలని నిర్ణయించడం.

నేను గత 20, 30 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కమిటీ వేసి ఇద్దరి వాదనల్నీ విన్న తర్వాతే ఎలాంటి చర్యకైనా సిద్ధపడాలి. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరించింది దర్శకుల సంఘం. నేను ఈ స్థాయికి రావడం వెనక నా ప్రతిభ, తెలివితేటలు, అవగాహన మాత్రమే కాదు. దర్శకులు, రచయితలు, నిర్మాతలు ప్రోత్సాహం కూడా ఉంది. ప్రేక్షకులు ఆదరించారు.
అలాగే నేను సినిమా కంటే గొప్పోణ్ని కాను. నా వాదనను 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దగ్గర వినిపించాను. వారిపై నాకు నమ్మకముంది. 'ఆగడు' నిర్మాతలు మంచోళ్లు. వీళ్లు మరో సినిమా చేస్తే అందులో నేను నటిస్తా. నాపై ఫిర్యాదు చేసిన సహాయ దర్శకుడు కూడా మంచోడే. అతను కథ చెబితే నేను రేపు సినిమా చెయొచ్చు. మహేష్‌బాబుకి కూడా నేనేంటో తెలుసు. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. తనపై కూడా నాకు ఏమీ లేదు. కానీ ఒక వ్యక్తి తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పేవాణ్నే. కానీ సంఘం నియమ నిబంధనలకు అది విరుద్ధం కాబట్టి చెప్పలేకపోతున్నా. 'మా' జరిపే విచారణ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయ''న్నారు.
ఆ ఒక్క వ్యక్తి గురించి ప్రకాష్‌రాజ్ పద్యం రాసుకొచ్చి సమావేశంలో చదివి వినిపించారు. ''నన్ను రాళ్లతో కొట్టాలనుకోకు... నేను ఆ రాళ్లతో ఇల్లు కడతాను. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఆ నిప్పుతో నేను దీపం వెలిగిస్తాను. నన్ను పరిశ్రమ నుంచి పంపించాలనుకోకు, నేను చేరాల్సిన గమ్యానికి ఇంకా త్వరగా చేరుకొంటాను. నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంఠుడిని అవుతాను'' అని పద్యం చదివి సమావేశం నుంచి వెళ్లిపోయారు.


Click it and Unblock the Notifications











