అక్కినేని ఇంటికి కోడలిగా మీనాక్షి చౌదరి? ఆ హీరోతో త్వరలోనే పెళ్లి?
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో పలువురు నటీనటులు తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి వైవాహిక బంధంలో అడుగుపెడుతున్నారు. పలువురి గురించి రూమర్స్ వస్తుండగా, మరికొందరు మాత్రం ఇంకా తమ బంధాన్ని గుట్టుగానే ఉంచుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మోడలింగ్ నుంచి నటనా రంగంలో అడుగుపెట్టారు. ఆమె తండ్రి భారత సైన్యంలో కీలక హోదాలో విధులు నిర్వర్తించారు. ఆర్మీ కుటుంబం కావడంతో మీనాక్షి చదువులో ముందు నుంచి టాపర్‌గా ఉండేవారు. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ హాస్పిటల్‌లో డెంటల్ సర్జరీలో గ్రాడ్యుయేషన్ చేశారు. మోడల్, డాక్టర్ మాత్రమే కాదు.. మీనాక్షి చౌదరిలో స్విమ్మర్, క్రీడాకారిణి కూడా ఉన్నారు. స్టేట్ లెవల్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్నారు మీనాక్షి చౌదరి. ఫెమినా మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలిచారు.

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో మీనాక్షి హవా
2019లో అప్‌స్టార్ట్స్ అనే హిందీ మూవీతో వెండితెరపై అడుగుపెట్టారు మీనాక్షీ చౌదరి. అనంతరం 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ తదితర చిత్రాల్లో నటించింది. అయితే వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు మీనాక్షి చౌదరి. ఆ వెంటనే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బాస్టర్ తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ది గోట్, సింగపూర్ సెలూన్, కోలై తదితర చిత్రాల్లో నటించారు మీనాక్షి చౌదరి.
చేతిలో రెండు సినిమాలు
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి నటించిన అనగనగా ఒకరాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదికాక.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన వృషకర్మ అనే సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇందులో ఆర్కియాలిజిస్ట్‌గా, పరిశోధకురాలిగా ఆమె కనిపించనున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కెరీర్‌లో సక్సెస్ బాటలో పయనిస్తున్నారు మీనాక్షి చౌదరి.. అయితే ప్రస్తుతం ఆమె ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి.
ఆ హీరోతో మీనాక్షి డేటింగ్
ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్. అతనితో మీనాక్షి డేటింగ్ చేస్తున్నట్లుగా గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో సుశాంత్, మీనాక్షిలు జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగేళ్లుగా వీరిద్దరూ గుట్టుగా తమ ప్రేమాయణం సాగిస్తుండగా.. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో సుశాంత్, మీనాక్షిలు జంటగా కనిపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ప్రస్తుతం హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉండటంతో త్వరలోనే చేతిలోని సినిమాలు పూర్తి చేసి సుశాంత్‌ని పెళ్లాడాలని మీనాక్షి అనుకుంటున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మీనాక్షి చౌదరి టీమ్ కనిపించింది. మీడియాలో వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. సుశాంత్, మీనాక్షిలు కేవలం స్నేహితులు మాత్రమేనని, ఆమెకు సంబంధించిన ఏదైనా విషయం ఉంటే తామే అధికారికంగా చెబుతామని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











