'అదుర్స్' గురించేనా..మోహన్ బాబు కామెంట్?
పండుగ సీజన్ ని మోహన్ బాబు తన వాడి వేడి కామెంట్స్ తో వేడిక్కించారు. ఉద్యమాల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వారి సంగతి త్వరలోనే తేలుస్తానని ఆయన అనటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమయింది. అదుర్స్ సినిమా విడుదల చేయటానికి తెలంగాణ వాదులు బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకున్నారనే విషయాన్ని ఆయన ప్రస్దావించారని చెప్పుకుంటున్నారు.వారి బండారం బయటపెట్టి.. ఎవరు డబ్బులు దండుకుంటున్నారో త్వరలోనే తాను నిరూపిస్తానని ప్రకటించటంతో ఎవరు డబ్బు దండుకున్నారు అనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
డబ్బు అందిన వారు సైలెంట్ అయ్యారని,అందనివారే తమకు కావాలని డైరక్ట్ గా అడగలేక రోడ్డెక్కి సినిమాలు ఆపుచేయమంటున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అలాగే రోజుకొకరు అదుర్స్ రిలీజ్ కోసం డబ్బు వసూలు చేసారని అంటూండటంతో అప్పటివరకూ ఈ విషయం తెలియని వారు సైతం ఆసక్తి కనపరిచి ఆశ్చర్యపోతూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఛీ కొడుతున్నారు.
ఇక సినీ పరిశ్రమలో కొంతమంది గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. తన కుమారుడు సలీం చిత్రాన్ని ఆపినప్పుడు, మనోజ్ షూటింగ్ ని అడ్డుకున్నప్పుడు చిత్ర మండలి కానీ, నా తోటి నటీనటులు కానీ స్పందించకుండా ఎవరి దారి వారు చూసుకున్నారని, వారి మనస్సులో మాటలు బయిటపెట్టాలని ఆయన ఆవేదనతో అన్నారు. దాంతో ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు..వారు ఎవరన్నది కూడా ప్రతీ సినిమా వారికి ఆసక్తి గొలిపై అంశంగా మారింది. ఏదైమైనా మోహన్ బాబు మరో సారి అందరిలో పైకి చెప్పలేక లోపలే మధనపడుతున్న ఆలోచనల తుట్టను కదిపినట్లయిందని మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











