పూజా హెగ్డే సినిమా ఆగిపోయిందా? బుట్ట బొమ్మను వెంటాడుతున్న దురదృష్టం
ఈమధ్య తన టైమ్ ఏంటో తనకే తెలియట్లేదు బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి. అసలే వరుస డిజాస్టర్ల కారణంగా పెద్దగా అవకాశాలు రావట్లేదు అని బాధపడుతుంటే, తాజాగా చేతిలో ఉన్న సినిమా కూడా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఓ హీరో కారణంగా ఈ బ్యూటీకి ప్రస్తుతం ఎక్కడా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మరి ఇంతకీ ఏ సినిమా విషయంలో ఇదంతా జరుగుతోంది? ఆ హీరో ఎవరు? అనే విషయంపై ఒక లుక్కేద్దాం.
గత కొన్నేళ్ళ నుంచి పూజ హెగ్డే అడుగుపెట్టిన ప్రతి సినిమా ఫెయిల్యూర్ గా నిలుస్తోంది. ఆచార్యతో మొదలుకొని రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ ఆమె వైపు కన్నెత్తి చూడడం మానేసింది. దీంతో బాలీవుడ్ లోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటుంది ఈ బ్యూటీ. కానీ అక్కడ కూడా ఆమె చేసిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఆడక పోవడంతో ఇటు సౌత్ అటు నార్త్ లో కూడా పూజా హెగ్డే ను సినిమా జనాలు పట్టించుకోవడం మానేశారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సాంకి అనే ఓ హిందీ మూవీ ఉంది. సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఈ కొత్త హీరో సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ మూవీనే ప్రస్తుతం ఆగిపోయే దశలో ఉందని సమాచారం. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్న హీరో అహన్ చేస్తున్న పనుల వల్ల విసిగి వేసారి పోయినా నిర్మాత సాజిద్ సినిమాను పక్కన పెట్టేద్దాం అన్న నిర్ణయానికి వచ్చేసారట.
నిజానికి అహన్ శెట్టికి ఇది రెండవ మూవీనే. ముందుగా ఈ హీరో ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ తడప్ మూవీతో బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. కానీ ఈ మూవీ పెద్దగా ఆడక పోవడంతో అహన్ తో సాంకి అనే సినిమాను చేస్తానని సాజిద్ మాటిచ్చారట. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకొనే క్రమంలోనే సాంకి మూవీని నిర్మిస్తున్నారు.
కానీ హీరో మాత్రం అనవసరమైన ఖర్చులన్నీ పెట్టిస్తూ నిర్మాతకు లేనిపోని తలనొప్పులు తీసుకొస్తున్నాడట. మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, డ్రైవర్, చెఫ్... అంటూ ఏకంగా ఓ మందను తీసుకొచ్చి వాళ్ల ఖర్చుల భారాన్ని ప్రొడక్షన్ హౌస్ మీద మోపుతున్నాడట. అయితే అసలే హీరో చేస్తున్న పనుల వల్ల చిరాగ్గా ఉన్న డైరెక్ట్ కి మరో ఎదురు దెబ్బ తగిలింది.

ఈ సినిమా రైట్స్ సరైన ధరకు అమ్ముడు పోలేదని టాక్ నడుస్తోంది. సాంకి మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నప్పటికీ, ఆశించిన ధర రాకపోవడంతో నిర్మాత నిరాశకు గురయ్యారు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలోనే అహన్ కి వార్నింగ్ ఇచ్చి నిర్మాత సాజిద్ సినిమాను ఆపేశారట.
విషయం తెలిసి సునీల్ శెట్టి మధ్యలో జోక్యం చేసుకొని, తన కుమారుడి టీం మెంబర్స్ ఖర్చులను తానే భరిస్తానని, సినిమాను పూర్తి చేయమని రిక్వెస్ట్ చేశారట. మరి సాజిద్ మనసు మార్చుకొని ఈ మూవీని మళ్లీ స్టార్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీ పూజా హెగ్డే కి కూడా చాలా ముఖ్యమన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ గనక ఆగిపోతే పూజ కెరీర్ పై పెద్ద దెబ్బే పడుతుంది.


Click it and Unblock the Notifications











